హలో జిందగీ. నా వయసు 28 సంవత్సరాలు. మరో ఇరవై రోజుల్లో నా పెండ్లి ఉంది. వేడుకలో అందంగా కనిపించడానికి ఫేషియళ్లు, ట్యాన్ ప్యాక్లలాంటివి ప్లాన్ చేసుకున్నా. అయితే కళకళలాడే ముఖం కావాలంటే మంచి ఆహారం కూడా అవసరమే అని భావిస్తున్నా. అందులోనూ రెండు మూడు రోజులపాటు జరిగే వేడుక కాబట్టి, త్వరగా అలసి పోకుండా ఉండేందుకు అలాగే చక్కగా కనిపించేందుకూ ఈ ఇరవై రోజులూ నేనేం తినాలో సలహా ఇస్తారా?!
పెండ్లి సమయంలో అందంగా కనిపించడం కోసం ఫేషియల్స్‌తో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలనుకోవడం మంచి విషయం. మెరిసే చర్మం ఉండాలంటే తప్పకుండా దానికి హైడ్రేషన్ ఉండాలి. అందుకోసం ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పండ్లూ కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి తింటే స్కిన్ బాగా గ్లో అవుతుంది. ఎండకాలం కాబట్టి ఎలాగూ లిక్విడ్స్ బాగానే తీసుకుంటాం. దాంతోపాటు కీరా, పుచ్చకాయలాంటివి తినాలి. వీటిలో నీరు పుష్కలంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, నారింజ, బొప్పాయి, దానిమ్మలాంటి పండ్లు కూడా చాలా మంచివి. వీటిలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బరువు పెరగకుండా తీసుకోవాలనుకుంటే, మనం తినే బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్యాహ్న భోజనానికి మధ్య తింటే సరి. అలాగే కూరల్లో బీట్రూట్, క్యారెట్, పాలకూర, దోసకాయలాంటివి తీసుకున్నా కూడా మంచి శక్తి ఉంటుంది.
వీటిలో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి లాంటి వివిధ పోషకాలు ఉంటాయి. ఐరన్ పెరగడం అంటే శరీరంలో రక్తం పెరగడం కాబట్టి, ఆరోగ్యంగా ఉంటాం. వీటన్నిటి నుంచి బోలెడు శక్తి వస్తుంది. చర్మమూ కాంతిమంతమవుతుంది. సబ్జా నీళ్లు, చియా గింజల నీళ్లలో నిమ్మకాయ పిండుకునో, లేదా కొబ్బరి నీళ్లలాంటివో తాగితే పొట్ట నిండిన అనుభూతి ఉంటుంది. అప్పుడు బయట ఏవి పడితే అవి తినకుండా ఉంటాం. బాదం కూడా చాలా మంచిది. అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) కూడా ముఖానికి మంచి గ్లో ఇస్తాయి. వీటిని పొడి చేసి సలాడ్లు, మజ్జిగలో చల్లుకోవచ్చు. కీరా, నిమ్మకాయ, అల్లంలాంటివి నీళ్లలో వేసి ఇన్ఫ్యూజ్డ్ వాటర్లా అప్పుడప్పుడూ తాగుతూ ఉండొచ్చు. దీనికి కూడా అవిసె గింజల పొడి కలుపుకోవచ్చు.
ఇందులో ఉండే అధిక పీచులు ఒంట్లో ఉన్న మలినాలను తీసేస్తాయి. రోజు ఒక టేబుల్ స్పూన్ దాకా వీటిని తీసుకోవడం వల్ల మంచి మార్పు కనిపిస్తుంది. టమాటాల్లో కూడా బాగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జ్యూస్ లేదా సలాడ్‌లా తీసుకుంటే చక్కగా విటమిన్ సి అందుతుంది. నాన్ వెజిటేరియన్లు చేపలను గ్రిల్ చేసుకుని లేదా షాలో ఫ్రై చేసుకొని తిన్నా మంచిదే. ఫేషియల్స్‌తో పాటు ఇవన్నీ చేయడం వల్ల లోపలి నుంచి చక్కటి గ్లో వస్తుంది. మంచి ఎనర్జీ కూడా ఉంటుంది. ఇక ఇరవై రోజుల్లో పెండ్లి అంటున్నారు కాబట్టి, ఎండకు ఎక్కువ తిరగకండి. ఈ సమయంలో ఒత్తిడి కూడా అధికమే. రోజుకు పది పదిహేను నిమిషాలు ధ్యానం చేసుకుంటే మైండ్ క్లియర్‌గా ఉంటుంది, దానివల్ల పనులననీ చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ముఖం కూడా ప్రశాంతంగా, కళగా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్!
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@ gmail.com