భారతీయులు శీతాకాల పర్యటనలకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా జెన్-జీ, మిలీనియల్స్.. మంచులో విహరించేందుకు క్యూ కడుతున్నారు. ఎయిర్ బీఎన్బీ 2025 వింటర్ ట్రావెల్ ట్రెండ్స్ సర్వే.. ఈ విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా.. దేశవ్యాప్తంగా 2,155 మంది పర్యాటకుల నుంచి వివరాలు సేకరించింది. ఏటా పర్యటనలు చేసేవారిలో 55 శాతం మంది శీతాకాల విహారాలకు ప్రాధాన్యం ఇస్తారని ఈ సర్వేలో తేలింది. ఇక చలికాలపు ప్రయాణాల్లో భాగంగా.. గోవా, కేరళ బీచ్‌లు, మనాలి, ముస్సోరీ, నైనిటాల్, రిషికేశ్ హిల్ స్టేషన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడైంది.
చల్లని వాతావరణం, సుందరమైన శీతాకాలపు ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడానికి, కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి నవతరం యాత్రికులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం పని షెడ్యూళ్లను సౌకర్యవంతంగా మార్చుకుంటున్నారట. శీతాకాలపు సెలవులను సద్వినియోగం చేసుకుంటూ.. మూటాముల్లె సర్దేస్తున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం, ఉద్యోగ బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకోవడంతోపాటు యాత్రల్లో సరికొత్త అనుభవాలను మూటగట్టుకోవాలని వీరంతా ఆశిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 30 శాతం మంది..
కాలానుగుణంగా వచ్చే సెలవులను ప్రయాణాలకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు చెప్పారు. 30 శాతం మంది.. విశ్రాంతి తీసుకోవడానికే ప్రయాణం చేస్తుండగా.. మరో 20 శాతం మంది శీతాకాలపు పండుగలు, సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచారు. ఇక మొత్తం యాత్రికుల్లో 50 శాతం మంది.. భాగస్వామితో కలిసి ప్రయాణించేందుకు ఉత్సాహం చూపించారు. మూడింట ఒక వంతు స్నేహితులకు ప్రాధాన్యం ఇవ్వగా.. 30 శాతం మంది మొత్తం ఫ్యామిలీతో ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్నారు.
సామాజికంగా, సామూహికంగా ప్రయాణాలు కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటివారు ఉమ్మడి అనుభవాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇక భారతీయ యాత్రికులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో గోవా, కేరళ అగ్రస్థానాల్లో నిలిచాయి. మనాలి హిల్ స్టేషన్.. భారతీయులకు ఇష్టమైన శీతాకాలపు విడిదిగా నిలిచింది. ముస్సోరీ, రిషికేశ్ లాంటివి క్లాసిక్ ఎస్కేప్ గమ్యస్థానాలుగా మారాయి. చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని కోరుకునే ప్రయాణికులు.. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్వైపు అడుగులేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం.. వారణాసి, బృందావన్‌కు ప్రయాణం కట్టేస్తున్నారు.