ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ పరిధి మారిపోయింది. కాల్స్, బ్రౌజింగ్, వీడియో చాటింగ్.. ఇలా అన్నీ దాటుకుని గేమింగ్ డివైజ్‌లా మారిపోయింది. ఫన్ కోసం ఆడేది కొందరైతే.. పైసలు బెట్టింగ్ వేసి ఆడేది ఇంకొందరు. యువత మొత్తం ఫన్ పేరుతో టైమ్‌ను పోగొట్టుకుంటుంటే.. అన్నీ తెలిసిన కొందరు పెద్దమనుషులు జీవితాల్ని పాడుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలీ గేమింగ్ వ్యవస్థలేంటి? అవి ఎలా స్మార్ట్‌ఫోన్ తెరపైకి కమ్ముకొస్తున్నాయి. వాటినెలా ప్రమోట్ చేస్తున్నారు. ఆ ఉచ్చులోంచి మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి?.. లాంటి విషయాల్ని తెలుసుకుందాం.
విస్తట్లో ఆరు రకాల వెరైటీ కూరలెలా ఊరిస్తాయో.. ఆరు అంగుళాల తెరపై ఆడే ఆన్లైన్ గేమ్స్ కూడా అలానే ప్లేయర్స్ ఆకట్టుకుంటున్నాయి. అవే చాన్స్గేమ్స్, స్కిల్గేమ్స్. చాన్స్గేమ్స్ అంటే ఫలితం పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. లక్కు కుదిరితేనే.. కిక్కు! గెలుస్తామా? ఓడతామా? అనేది మన చేతుల్లో ఉండదు. లాటరీ, డైస్ గేమ్స్.. లాంటివి ఈ కోవలోకి వస్తాయి. ఇక స్కిల్గేమ్స్ అంటే మన ప్రతిభతో ఆడేవి. ఎనర్జీతోపాటు మెంటల్ స్కిల్స్ బాగా వాడాల్సిందే! పోకర్, రమ్మి లాంటివి ఈ కోవలోకే వస్తాయి. స్పోర్ట్స్ బెట్టింగ్స్లోనైనా పాపులర్ గేమ్స్‌పై పందాలు వేయడం. క్రికెట్, ఫుట్‌బాల్.. ఇలాంటి మ్యాచ్‌లపై బెట్టింగ్స్ వేయడం. క్యాసినో గేమ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గేమ్స్ మరికొన్ని. వీటన్నిటినీ వర్చువల్‌గా ఆడేస్తూ.. తాకేతెరపై తేలియాడుతున్నారు.
ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్ అయ్యే పదం ఒకటుంది.. అదే ‘సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్’. వీళ్లిప్పుడు నెట్టింట్లో పరిచయం అక్కర్లేని సెలెబ్రిటీలు. వాళ్లేం చెబితే అది మార్కెట్లో దూసుకెళ్తున్నది. అందుకే.. వీళ్లనే వారధులుగా చేసుకుని బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. వీళ్లు తమ ఫాలోవర్లని ఇట్టే ప్రేరేపిస్తారు. నమ్మకమైనవే అని చెబుతారు.. ‘మేం బాగా సంపాదించాం’ అంటారు. ఆఫర్లూ.. బోనస్‌లు.. డిస్కౌంట్లు అంటూ డప్పు వేస్తారు. రిఫరల్ కోడ్ ఇస్తారు. లింక్‌లపై క్లిక్ చేసి జాయిన్ అవ్వమంటారు. అంతేనా.. ఇంత సంపాదన.. అంత సంపాదన అంటూ సక్సెస్ స్టోరీలు చెబుతారు. ఎలాగైనా గేమ్ ఆడి తీరాల్సిందే అనిపించేంతలా ప్రభావితం చేస్తారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇదంతా ఫ్రీగా ఏం చేయరు. గేమింగ్ కంపెనీల నుంచి లక్షల్లో చార్జ్ చేస్తారు తెలుసా?
ఈ గేమింగ్ వలయంలో చోటు చేసుకునే మోసాల తాలూకు ట్విస్ట్‌లు మామూలుగా ఉండవు. నకిలీ ప్రకటనలతో వలేస్తారు. ఒక్కసారి ఆడారంటే.. రెట్టింపు మొత్తంలో బెట్టింగ్స్ గెలుచుకోవచ్చంటూ కొన్ని.. డబ్బు డిపాజిట్ అయినట్టుగా కనిపించే స్క్రీన్షాట్లు కొన్ని ఫ్లాష్ చేస్తుంటారు. మరోవైపు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేలా ఫిషింగ్ అటాక్స్ చేస్తారు. లింక్‌ల రూపంలోనో.. ఫేక్ యాప్ డౌన్లోడ్స్ ద్వారానో యూజర్ల డేటా సేకరించి మోసాలకు పాల్పడతారు. బెట్టింగ్స్‌లో ‘బోనస్ ట్రాప్స్’ మరో రకం. పందెం కట్టినదానికంటే ఎక్కువ గెలుచుకోవచ్చంటూ డబ్బు డిపాజిట్ చేసుకుంటారు. గెలిచాం కదాని డబ్బు విత్‌డ్రా చేయడానికి చూస్తే.. నో క్యాష్. అంతా ట్రాష్ అని తెలుస్తుంది.
దేశంలో సైబర్ చట్టాలు కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ.. ఇతర దేశాల నుంచి, వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్) ద్వారా హ్యాకర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థికపరమైన లావాదేవీలకు క్రిప్టోకరెన్సీ, ఈ-వాలెట్స్, ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వేలని వాడుతున్నందు వల్ల మోసాల్ని ట్రాక్ చేయడం కష్టసాధ్యం అవుతుంది. అందుకే.. ఏదైనా ఆన్లైన్ గేమ్ ఆడేముందే దాని తాలూకు వివరాల్ని జల్లెడపట్టాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే వాటి వెనకున్న ఆంతర్యాన్ని గ్రహించాలి.
వాళ్ల పెయిడ్ ప్రమోషన్స్ వెనకున్న వాణిజ్య ఒప్పందాల్ని అర్థం చేసుకుంటే బెట్టింగ్ గేమ్స్ ఆడేందుకు ఆసక్తి చూపరు. ఒకవేళ టైమ్‌పాస్‌కు ఆడుదాం అనుకుంటే.. చిన్నమొత్తంలో బడ్జెట్ కేటాయించి సరదాగా ఆడే ప్రయత్నం చేయండి. అది మన ఆర్థిక శ్రేయస్సుకు ఎంతో మంచిది. కాలక్షేపానికి ఆన్లైన్ గేమ్స్ ఒక్కటేనా? ఒక్కసారి ఫోన్ పక్కనపెట్టి ప్రత్యామ్నాయ గేమ్స్‌పై ఫోకస్ పెట్టండి. గ్రౌండ్లో దిగితేనే.. ఆటలో మజా తెలిసేది! ఆరు అంగుళాల తెరపై ఏముందీ.. అంతుచిక్కని ప్రమాదాలు తప్ప. బీసేఫ్.. బ్రౌజ్ సేఫ్!!
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్