కాలా గాజర్ (Kala Gajar)..! నల్లరంగులో ఉండే క్యారెట్ (Black Carrot) లనే హిందీ, ఉర్దూ భాషల్లో కాలా గాజర్ అని పిలుస్తారు. సాధారణంగా ఎక్కువగా లభ్యమయ్యే క్యారెట్లు కాషాయ రంగులో ఉంటే.. ఈ కాలా గాజర్లు నల్లగా ఉంటాయి. కాలా గాజర్లలో కొన్ని బాగా నలుపురంగులో ఉంటే, మరికొన్ని మాత్రం నలుపు ఎరుపు మిశ్రమంగా బీట్రూట్ రంగులో కనిపిస్తాయి. రుచికి మాత్రం ఇవి సాధారణ కాషాయ రంగు క్యారెట్లు ఉన్నంత తీయగా ఉండవు. కానీ, కాషాయ రంగు క్యారెట్లతో పోల్చితే ఈ నల్లరంగు క్యారెట్లలో ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
1. నల్లరంగు క్యారెట్లలో ఆంథోసైనిన్ అనే పదార్థం ఉంటుంది. దానివల్ల వాటికి నల్ల రంగు వస్తుంది. ఈ ఆంథోసైనిన్ మన శరీరానికి క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని ఇస్తుంది.
2. ఆరెంజ్ క్యారెట్లలో ఉన్నట్టే నల్ల రంగు క్యారెట్లలో కూడా బీటా కెరాటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి కణాలకు రక్షణ కల్పిస్తుంది.
3. నల్ల క్యారెట్లలో పీచు పదార్థం అధికం. అందువల్ల ఇవి ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు తోడ్పడుతాయి. నల్ల క్యారెట్లు తినడంవల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవ్వడమేగాక ఒంట్లో కొవ్వు తగ్గుతుంది.
4. వయసు మళ్లిన వారిలో చాలామందిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య వేధిస్తుంటుంది. నల్ల క్యారెట్లలో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఈ సమస్యకు మంచి పరిష్కారం చూపుతాయి.
5. కొంతమందిలో వయస్సుతోపాటే మతిమరుపు సమస్య పెరుగుతుంది. అలాంటివారు నల్ల క్యారెట్లు తినడం అలవాటు చేసుకుంటే పరిష్కారం లభిస్తుంది. అంతేగాక నల్ల క్యారెట్లు అల్జీమర్స్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి.
6. అయితే ఈ నల్ల క్యారెట్లను అతిగా తింటే అలర్జీలు, రక్తపోటులో హెచ్చుతగ్గుల లాంటి సమస్యలు వస్తాయి. రోజుకు ఒకటి, రెండు క్యారెట్లకు మించకుండా తింటే మాత్రం ఏ సమస్యా ఉండదు.