భూమికి తెలిసిన కాలం వేరు. తన లెక్క అంతా పగలు, రాత్రులతో, రుతువులతో గడుస్తుంది. కానీ, మనిషి.. పాపం అల్పుడు. తనకున్న సమయం తక్కువ. అందుకే ఆ రుతువుల చక్రాన్ని నెలలుగా, రోజులుగా, గంటలుగా, సెకన్లుగా తనకు అనుగుణంగా మార్చేసుకున్నాడు. అది కేవలం సౌలభ్యం కోసమే కాదు. గడిచిన సమయాన్ని బేరీజు వేసుకోవడం కోసం. రాబోయే సమయానికి ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కోసం. కానీ, ఈసారి కాలం కాస్త కష్టంగానే గడుస్తున్నది. సంవత్సరం అంటే సవాళ్లే గుర్తుకొస్తున్నాయి. గత ఏడాది మొదలైన కొన్ని పోకడలు కేవలం వార్తలుగానే మిగిలిపోలేదు. హద్దులు దాటి మన జీవితాల్లోకే ప్రవేశిస్తున్నాయి. అందుకే ఓసారి వాటిని గమనించుకుని, అందుకు అనుగుణంగా మన జీవితాలను సన్నద్ధం చేసుకునే ప్రయత్నం ఇది. నూతన సంవత్సరానికే కాదు.. నూతన జీవితానికి కూడా ప్రతిపాదన ఇది.
1965లో మూర్ అనే ఇంజినీర్ ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సాంకేతికత ప్రతి రెండేళ్లకీ రెట్టింపు అవుతుందని. తనేదో సర్క్యూట్ బోర్డులకు సంబంధించి ఈ ప్రతిపాదన చేశాడు కానీ.. నిజంగానే మన చుట్టూ ఉన్న సాంకేతికత యావత్తూ రెండేళ్లకే మారిపోవడం చూసి ఈ మూర్స్ సిద్ధాంతాన్ని అందరూ నమ్మేశారు. ఇప్పుడు మూర్స్ సిద్ధాంతం కేవలం కంప్యూటర్లకే పరిమితం కావడం లేదు. మొబైల్స్ నుంచి సోషల్ మీడియా వరకూ అనూహ్య మార్పులు వచ్చేస్తున్నాయి. వాటితోపాటు ముడిపడి ఉన్న మన జీవితమూ మారిపోతున్నంది.
ఒక మెయిల్ లోడ్ కావడం కోసం అయిదు నిమిషాలు చూసిన రోజులు వేరు. ఆ అయిదు నిమిషాల్లోనే పది గిగాబైట్ల వీడియో డౌన్లోడ్ అవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్న కాలమిది. మూడున్నర గంటల సినిమా చూసే ఓపిక నుంచి ముప్పై సెకన్ల రీల్ కూడా పెద్దదిగా తోచే సమయమిది. అందుకే చుట్టూ వచ్చే మార్పులకు అతీతంగా ఉంటానంటేకుదిరే పని కాదు. వాటికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాల్సిందే! కేవలం సాంకేతికతే కాదు.. డాలర్ ధర నుంచి కొత్త వైరస్ వరకూ ప్రతిదీ మన వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసేదే. ఆ డాలర్‌తోనే మన కథ మొదలుపెడదాం.

డాలర్ మారకం విలువ పెరిగితే మనకేంటి, మనం వాడేది రూపాయలు కదా!? అని ఓ నాయకుడు నోరుజారి అభాసుపాలయ్యాడు. డాలర్, రూపాయల మధ్య వ్యత్యాసం పెరగడం అంటే.. అంతర్జాతీయ మార్కెట్లో మనం కొనే ప్రతిదీ ఖరీదుగా మారడమే. చమురు, బంగారం, ఎరువులు, వంటనూనె, గ్యాస్ అన్నింటి మీదా ఈ ప్రభావం ఉంటుంది. విదేశాల్లో చదువుకునే విద్య మరింత ఖరీదుగా మారుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఎక్కువగా దిగుమతి అయ్యేవే కాబట్టి.. వాటి ధరా పెరుగుతుంది. విదేశాల నుంచి జీతాలు, నిధులు అందుకునేవారికి మాత్రమే ఈ పరిస్థితి పండుగ. ఎగుమతిదారులకూ కాస్త లాభమే. విదేశీ పెట్టుబడుల మీద, ప్రభుత్వ సబ్సిడీల మీద కూడా డాలర్ సంక్షోభం ఉంటుంది. పరోక్షంగా దెబ్బతీసే డాలర్ విలువను ఎలా తప్పించుకోగలం. అసాధ్యమే. కానీ కొన్ని మార్గాలున్నాయి.
ఆన్లైన్ దోపిడి:
ప్రభుత్వ అంచనా ప్రకారమే మన దేశంలో 86 శాతం కుటుంబాలకు ఆన్లైన్ సౌకర్యం ఉంది. దీనర్థం.. అంతమందీ కూడా ఏదో ఒక రకంగా సైబర్ మోసానికి గురయ్యే అవకాశం ఉందన్నమాట! ఇప్పుడు ప్రతీ అకౌంట్ మన మొబైల్‌కి అనుసంధానంగా ఉంది కాబట్టి.. మొబైల్ పేమెంట్స్ సర్వసాధారణంగా మారాయి. మోసాలు తేలిక అయిపోయాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే నెలకు సగటున వెయ్యి కోట్ల రూపాయల ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. అనధికారికంగా ఇంతకు పదింతల నష్టం జరుగుతున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తొలిరోజుల్లో విషింగ్ పేరుతో విపరీతమైన మోసాలు జరిగేవి. బ్యాంక్ లేదా ప్రభుత్వ అధికారుల్లాగా దర్జాగా ఫోన్ చేసి కార్డ్ నెంబర్, ఓటీపీ, ఏటీఎమ్ పిన్, సీవీవీ లాంటి వివరాలతో సులభంగా దోచేసేవారు. ఊళ్లకు ఊళ్లే ఈ మోసపు ఉపాధితో బతికేసేవి. ఇలాంటి కుట్రల గురించి అవగాహన పెరిగిపోవడంతో ఇప్పుడు సరికొత్త మార్గాలు పుట్టుకొస్తున్నాయి.
ఉదాహరణకు ఓ వ్యక్తి తన లోన్ కోసం ఎదురుచూస్తున్నాడే అనుకుందాం. తను దరఖాస్తు చేసిన బ్యాంక్ పేరు మీదుగా ఓ ఫైల్ వచ్చింది. ఈ ఫైల్ నింపితే మీ లోన్ ప్రక్రియ పూర్తవుతుందనే సందేశం జతచేసి ఉంది. కానీ, దాన్ని డౌన్లోడ్ చేసుకోగానే.. ఫోన్ మరొకరి స్వాధీనంలోకి వెళ్లిపోయింది. మరో చిత్రమైన ఉదాహరణ! మీ పేరు చంద్రశేఖరేనా అని ఓ కాల్ వస్తుంది. ‘ఎస్’ అని జవాబు చెప్పగానే, ఖాతా ఖాళీ అయిపోతుంది. ఈమధ్య బ్యాంకులు ఇచ్చిన ‘వాయిస్ అథెంటికేషన్’ సౌకర్యాన్ని హ్యాకర్లు వాడుకోవడమే ఇందుకు కారణం.

గాలి వార్తలు:
పాకిస్థాన్ పార్లమెంట్‌లోకి ఓ గాడిద దూసుకువచ్చి అల్లకల్లోలం చేసేసింది అంటూ ఓ వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోను ఎంత తీక్షణంగా చూసినా ఓ చట్టసభ, అందులోకి గార్ధభం రావడం, సభ్యులు కిందామీదా పడటం అంతా స్పష్టంగానే కనిపిస్తుంది. తీరా అనుమానం వచ్చి గూగుల్ సెర్చ్ చేస్తే అది ఫేక్ అని తేలుతుంది. ఎలాంటి సన్నివేశాన్ని అయినా.. ఇట్టే రూపొందించేసే డీప్‌ఫేక్ సాంకేతికత వచ్చిన తర్వాత ఒకరిని కించపరచడానికో, మరొకరిని ఉన్నతంగా చూపించడానికో నకిలీ వార్తలు ప్రచారం అవుతున్నాయి. కొన్ని సందర్భాలలో అవి ప్రమాదం లేనట్టు తోచినా.. చాలాసార్లు కులం, మతం, ప్రాంతాల మధ్య విద్వేషాలను ఎగదోస్తున్నాయి.
ఓ అంచనా ప్రకారం లోకంలో 86 శాతం ప్రజలు ఈ ఫేక్ న్యూస్ బారిన పడుతున్నారు. వారిలో చాలామంది అది నిజమని నమ్మేస్తున్నారు కూడా. ఎందుకంటే కృత్రిమ మేధస్సు వల్ల ఈ ఫేక్ న్యూస్ మరింత నమ్మదగ్గదిగా మారిపోతున్నది. ఓ విశ్లేషణలో ఉన్నత సాంకేతికతతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలను కేవలం 0.1 శాతం మంది మాత్రమే నకిలీవిగా గుర్తించగలిగారంట. ఇక వాట్సాప్ సందేశాలు, ఫేస్బుక్ పోస్టుల ద్వారా ప్రచారమయ్యే నకిలీ వార్తలకైతే అడ్డే లేదు. ఎందుకంటే 67 శాతం నకిలీ వార్తలు సోషల్ మీడియా ద్వారానే ప్రచారం అవుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు వీధి నాటకాలు, జాగ్రత్తగా ఉండమనే ప్రకటనలు సహా వాట్సాప్ ఎంత ప్రయత్నించినా నష్టం జరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఇవి ఎన్నికలను సైతం ప్రభావితం చేస్తాయనే భయం ఉంది.
కాలుష్యం:
ఒకప్పుడు వాటర్ ప్యూరిఫయర్ అంటే చిత్రంగా చూసేవారు. అది ఇప్పుడు ఓ అవసరంగా మారింది. ఇక ఎయిర్ ప్యూరిఫయర్ల వంతు. అందరి నోటా ఇప్పుడు AQI అనే మాటే వినిపిస్తోంది. సాధారణంగా ఇది 150 పరిమితిని దాటితే ప్రమాదకరంగా భావిస్తారు. కాస్త ఫర్వాలేదు అనుకునే హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఇది 200కి దగ్గరగా ఉంటుంది. ఇక ఢిల్లీ సంగతి అయితే చెప్పనక్కర్లేదు ఈ శీతకాలం 500 మార్కును దాటి నివాసయోగ్యం కాని పరిస్థితుల్లో ఉంది. ఈ స్థాయిలో కాలుష్యం అంటే ఊపిరితిత్తులను, గుండెను పొగతో నింపడమే. ప్రపంచవ్యాప్తంగా 30 కాలుష్య నగరాల్లో 21 మన దేశంలోనే ఉన్నాయని ఓ అంచనా. దానివల్ల ఏటా 20 లక్షల మంది పరోక్షంగా చనిపోతున్నారనీ, 80 వేల కోట్లకు పైగా ఆర్థిక నష్టమనీ మరో పరిశీలన. వాహన కాలుష్యం, నిర్మాణాల నుంచి వచ్చే దుమ్ము, పంటలు తగలబెట్టడం, శీతకాలపు మంచు, పరిశ్రమల పొగ.. అన్నీ కాలుష్య కారకాలే. మరి దీన్ని తప్పించుకోవడం ఎలా!
విద్వేషం.కామ్:
సోషల్ మీడియా ఇప్పుడో యుద్ధరంగంగా మారిపోయింది. నేరుగా కలబడే తీరిక, దైర్యం, నైతికత లేనివారు పోస్టులకు పని చెబుతున్నారు. గతంతో పోలిస్తే 2025 నాటికి ఈ విద్వేష పోస్టులు 74 శాతం పెరిగిపోయాయని అంచనా. 30-37 శాతం మంది యువత ఈ సైబర్ విద్వేషానికి గురవుతున్నట్టు నివేదిక. మరీ ముఖ్యంగా మహిళలు, సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు.. వీటి బారిన పడుతున్నారు. ప్రత్యర్థులను ఇలా మానసికంగా హింసించేందుకు డబ్బులు తీసుకునో, అభిమానంతోనో ద్వేషాన్ని వెళ్లగక్కే ట్రోల్ ఆర్మీలే బయల్దేరుతున్నాయి. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారిని అసలు దేశంలోకే రానివ్వకుండా ఉండేందుకు ఏకంగా వీసాల ప్రక్రియనే నిలిపివేసింది అమెరికా. వెట్టింగ్ ద్వారా వీరిని జల్లెడ పట్టే ప్రక్రియ మొదలుపెట్టింది.

Andani Chandamama
2026 కృత్రిమ యుద్ధం
డీప్‌ఫేక్ వీడియోలు, చాట్ జీపీటీ సమాచారం, యానిమేషన్.. వీటన్నింటితో కృత్రిమ మేధ సత్తా ఏంటో తెలుస్తూనే ఉంది. కానీ, అది నేరుగా మన ఉద్యోగాలకే ఎసరు పెట్టడం మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి. ఓ అంచనా ప్రకారం కృత్రిమ మేధతో 2025లోనే లక్షన్నర ఉద్యోగాలు పోయినట్టు అంచనా. రాబోయే ఏడాది అది మరింత తీవ్రం కావచ్చని అనుమానం. ఏఐతో నిరుద్యోగం ఎదుర్కోవడం ఒక సమస్య. దాన్ని ఎదుర్కొనేందుకు స్పష్టత ఉండాలి.
…? కె.ఎల్.సూర్య

Kalushyam