రోగం భయంకరమైంది. వైద్యం ఖరీదైంది. రోగ నిర్ధారణ పరీక్షలు ఇబ్బందికరమైనవి. అసలు రోగమే రాకుండా, దవాఖానలో కాలుపెట్టాల్సిన అవసరమే లేకుండా హాయిగా బతకాలంటే ఒకటే మార్గం. తరచూ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం. ఆ ప్రయత్నంలో ఆర్క రీసెర్చ్ సంస్థ వ్యవస్థాపకురాలు గాయత్రి తిరుగులేని ఆవిష్కరణలు చేశారు.
కొన్నిసార్లు గాయాలు స్ఫూర్తినిస్తాయి. చేదు అనుభవాలు దిశానిర్దేశం చేస్తాయి. గాయత్రి ఇంట్లో మెడిసిన్ చదివిన వారు ఉన్నారు. కానీ, ఎవరూ ఆమె తండ్రి అనారోగ్యాన్ని తొలిదశలో గుర్తించలేకపోయారు. ఆయన మరణాన్ని ఆపలేకపోయారు. శాశ్వతంగా దూరమైపోయిన నాన్న జ్ఞాపకాలే.. ఆమెను కొత్త ప్రపంచం వైపు అడుగులు వేయించాయి. తనకు సంబంధం లేని రంగంవైపు పరుగులు పెట్టించాయి. రోగం వచ్చాక వైద్యం చేయడం కంటే.. రాకుండా జాగ్రత్త పడటంతోపాటు, రాబోయే ప్రమాదాన్ని ముందుగా గుర్తించే విప్లవాత్మక సాంకేతికతను రూపొందించే దిశగా ప్రోత్సహించాయి. ఓ సర్జన్ సాయంతో తన డేటా అనలిస్ట్ అనుభవాన్ని జోడించి సూది గుచ్చకుండానే డయాబెటిస్, గుండె వ్యాధుల తీవ్రతను పసిగట్టే టెక్నాలజీని ఆవిష్కరించారు గాయత్రి.
కంపెనీని స్థాపించిన నాలుగేండ్లలోనే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వ్యాపారాన్ని విస్తరించారు. ఇప్పటివరకు పన్నెండు వేల మందిని పరీక్షించారు. భవిష్యత్తులో రాబోయే టైప్-2 డయాబెటిస్, హృద్రోగాలకు సంబంధించి.. 90 శాతం కచ్చితమైన అంచనాతో హెల్త్ ప్రొఫైల్ అందిస్తూ హెల్త్ కేర్ రంగం మీద తనదైన ముద్ర వేస్తున్నారు.. ఆర్క రీసెర్చ్ సంస్థ వ్యవస్థాపకురాలు గాయత్రి. ఆ జ్ఞాపకాలను, అనుభవాలు ఆమె పంచుకుంటున్నారిలా.. “గుంటూరు స్వస్థలమే అయినా.. హైదరాబాద్, బెంగళూరుతో ఎంతో అనుబంధం ఉంది. అమ్మ నిర్మల, నాన్న బ్రహ్మచారి.. ఇద్దరూ ఉపాధ్యాయులే. ఇంజినీరింగ్ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేశాను. ఆ తర్వాత కొన్ని బహుళజాతి సంస్థలకు డేటా అనలిస్ట్‌గా వ్యవహరించాను. ఇండియాకు తిరిగొచ్చాక డిజిటెంట్ కన్సల్టెన్సీ ప్రారంభించాను. సరిగ్గా అప్పుడే.. అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నాన్న బ్రెయిన్ స్ట్రోక్‌తో దూరమయ్యారు. ఆ కుదుపు నన్ను హెల్త్ కేర్ రంగం వైపు అడుగులు వేసేలా చేసింది. ఆర్క రీసెర్చ్ సెంటర్ ప్రారంభానికి నాంది పలికింది.
రోగాల తీవ్రతను పసిగట్టేలా..
డయాబెటిస్, గుండె వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తాయి. ప్రాణాలను కబళిస్తాయి. అలాంటి రుగ్మతలను గుర్తించాలంటే ప్రీ-
డయాగ్నొసిస్ అవసరం. భవిష్యత్తులో రాబోయే రోగాలను ముందుగానే పసిగట్టే మార్గాలను వెతుకుతున్న తరుణంలో.. బయో మెడికల్ ఇంజినీరింగ్ నిపుణులు జయంతి రాసిన ఓ ఆర్టికల్ నా ఆశలకు ఊపిరి పోసింది. తక్షణమే ఆమెను సంప్రదించాను. సానుకూలంగా స్పందించారు. ఆలోచనలను పంచుకున్నారు. తనవంతు సహకారం అందించారు. డేటా అనాలసిస్‌లో నా అనుభవాన్ని జోడించి.. ఏఐ (కృత్రిమ మేధ) సైంటిస్ట్ సమీర్‌తోపాటు కొందరు మిత్రులతో కలిసి ఇంటెలిజెంట్ హెల్త్ రిస్క్ అసెస్మెంట్ సాఫ్ట్వేర్ రూపొందించాను. దీన్ని థర్మల్ కెమెరాలో ఇన్స్టాల్ చేసి ప్రాథమికంగా 250 మందిపై ప్రయోగం చేశాం. వాళ్లకు రక్త, అల్ట్రా సౌండ్ పరీక్షలు కూడా చేయించాం. ఆ గణాంకాలతో పోల్చినప్పుడు, 95 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చాయి. దీంతో మా ఆవిష్కరణ మీద మాకు నమ్మకం కలిగింది. జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం.
సూది గుచ్చకుండానే
చాలామంది మెడికల్ టెస్టులు అంటే రక్తం తీయడం, ఎక్స్‌రే తీసుకోవడం మాత్రమే అనుకుంటారు. దీంతో భయపడిపోతారు. మా టెక్నాలజీతో సూది గుచ్చకుండానే వైద్య పరీక్షలు చేయవచ్చు. సెకనుకు 30-35 చొప్పున, నిమిషానికి 1800-2000 ఫొటోలను తీయగల టెక్నాలజీతో.. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నరాలు, వాటిలో రక్తప్రసరణ వేగం, థర్మల్ స్క్రీనింగ్‌లో వచ్చే సిగ్నల్స్ ఆధారంగా భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను కనిపెట్టగలం. ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో హెల్త్ రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్‌ను నేరుగా మొబైల్ లేదా ఈమెయిల్‌కు అందిం చవచ్చు. అతి తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని పరీక్షించే అవకాశం ఉందిక్కడ. ఐఎస్ఓ ఆడిట్, క్లినికల్ ట్రయల్స్, పేటెంట్స్ వచ్చిన తర్వాతే మా వ్యాపారం మొదలైంది. హైదరాబాద్‌లోని కిమ్స్, ముంబైలోని కింగ్ జార్జ్ హాస్పిటల్స్‌కు కూడా ప్రీ డయాగ్నొసిస్ సేవలను అందిస్తున్నాం. ఇప్పటివరకు 12 వేలకు పైగా టెస్టులు చేసి నాణ్యమైన ఫలితాలను అందించాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి లక్ష మందికి ప్రీ డయాగ్నొసిస్ పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో ఆర్క విస్తరణ ప్రణాళికలు రూపొందించాం. రూ. 150-350 ఖర్చుతో కంప్లీట్ డయాబెటిస్, కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధుల గుట్టు తేల్చుకోవచ్చు. అది కూడా శరీరానికి ఎలాంటి గాయం చేయకుండానే ఫలితాలు తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఇంటెలిజెంట్ హెల్త్ రిస్క్ అసెస్మెంట్కు మరింత ఆదరణ, డిమాండ్ పెరుగుతుందని మా నమ్మకం”
…? కిరణ్ కడార్ల