Green Tea Vs Black Tea | ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ గ్రీన్ టీ తాగాలని వైద్యులు చెబుతుంటారు. అలాగే బ్లాక్ టీని కూడా తాగాలని సూచిస్తుంటారు. గ్రీన్ టీ, బ్లాక్ టీని వేర్వేరుగా తయారు చేస్తారు. వీటి తయారీకి ఉపయోగించే టీ ఆకులు కూడా వేరేగా ఉంటాయి. అయితే కొందరు గ్రీన్ టీని తాగమని చెబితే, కొందరు బ్లాక్ టీ మంచిదని అంటారు. మరి వాస్తవానికి ఈ రెండు టీలలో దేన్ని తాగాల్సి ఉంటుంది..? ఏ టీలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..? ఏ టీని రోజూ తాగితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు..? అని చాలా మందికి సందేహాలు కలుగుతుంటాయి. వీటికి వైద్యులు సమాధానాలు చెబుతున్నారు. గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండింటికి సంబంధించి తేయాకులను కూడా Camellia sinensis అనే మొక్క నుంచి సేకరిస్తారు. కానీ ఈ ఆకులను వేర్వేరుగా ప్రాసెస్ చేస్తారు. దీంతో గ్రీన్ టీ, సాధారణ టీ రెడీ అవుతాయి. గ్రీన్ టీ గా తయారు అయ్యే ఆకులు కాస్త తక్కువ ప్రాసెస్ చేయబడతాయి. సాధారణ టీ గా మారే ఆకులను ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. వీటిని పొడిగా మారుస్తారు. అనంతరం దీంతో బ్లాక్ టీ తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
Camellia sinensis ఆకులను ఉడికించగా తయారు అయ్యే ఆకులను గ్రీన్ టీ ఆకులుగా వ్యవహరిస్తారు. కానీ Camellia sinensis ఆకులను పొడి చేసి పులియ బెట్టడం ద్వారా సాధారణ టీ పొడిని తయారు చేస్తారు. కనుక గ్రీన్ టీ, సాధారణ టీ తయారీ వేరుగా ఉంటుంది. అయితే ఈ రెండు టీలు మనకు దాదాపుగా ఒకేలాంటి లాభాలను అందిస్తాయి. కానీ పోషకాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఈ రెండు టీలలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీలో కాటెకిన్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే బ్లాక్ టీలో థియా ఫ్లేవిన్స్, థియారుబిజిన్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి భిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గ్రీన్ టీని సేవించడం వల్ల కెఫీన్ చాలా తక్కువగా లభిస్తుంది. కానీ బ్లాక్ టీలో కెఫీన్ అధికంగా ఉంటుంది. గ్రీన్ టీ కాస్త చేదుగా, వగరుగా ఉంటే, బ్లాక్ టీ పులిసిన రుచిని కలిగి ఉంటుంది.
గ్రీన్ టీని సేవించడం వల్ల మనకు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ముఖ్యంగా గ్రీన్ టీని తాగితే ఈజీసీజీ అనే సమ్మేళనం లభిస్తుంది. ఇది చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మన శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించి వాపులను తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. దీని వల్ల బ్రెస్ట్, ప్రోస్టేట్, కోలన్ వంటి క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చు. ఇక బ్లాక్ టీలో టీ పొడి ప్రాసెసింగ్‌కు గురవుతుంది కనుక చాలా వరకు ఈజీసీజీ నశిస్తుంది. అయినప్పటికీ పలు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఈజీసీజీ లాంటి లాభాలనే అందిస్తాయి. కానీ చాలా తక్కువ శక్తివంతమైనవి. కనుక క్యాన్సర్లకు అడ్డుకట్ట వేయడంలో బ్లాక్ టీ కన్నా గ్రీన్ టీ ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. ఇక ఈ రెండు టీలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ఇక బ్లాక్ టీని సేవిస్తే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఈ విషయంలో గ్రీన్ టీ కన్నా బ్లాక్ టీ ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. అయితే మనస్సు ప్రశాంతంగా మారాలంటే మాత్రం గ్రీన్ టీని సేవించాల్సి ఉంటుంది. ఇక అధిక బరువును తగ్గించడంలో బ్లాక్ టీ కన్నా గ్రీన్ టీ ఎంతో ఉత్తమంగా పనిచేస్తుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే ఈ రెండు టీలను తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. ఇవి ప్రీ బయోటిక్ ఆహారాలుగా పనిచేస్తాయి. అందువల్ల వీటిని తాగితే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు ఈ రెండు రకాల టీలలో దేన్ని తాగాలి.. అంటే.. రెండింటినీ తాగాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం బ్లాక్ టీని, సాయంత్రం గ్రీన్ టీని ఒక కప్పు మోతాదు చొప్పున తాగుతుంటే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. రెండు రకాల టీలను సేవించడం వల్ల అన్ని లాభాలను పొందవచ్చని అంటున్నారు.