Dharmendra | బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) నవంబర్ 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. 1935 డిసెంబర్ 8న జన్మించిన ఆయన, 1960లో వచ్చిన ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ చిత్రం ద్వారా సినిమా రంగంలో అడుగుపెట్టారు. కొద్దికాలంలోనే తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ధర్మేంద్ర, ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్‌కు ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉండగా, వారితో పాటు కుమార్తెలు విజేత, అజిత ఉన్నారు.
1970లలో ‘డ్రీమ్ గర్ల్’ హేమమాలినితో కలిసి చేసిన సినిమాల సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. ‘సీతా ఔర్ గీత’, ‘షోలే’ వంటి క్లాసిక్ చిత్రాలతో ఈ జంట అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే అప్పటి కథనాల ప్రకారం, ‘షోలే’ షూటింగ్ సమయంలో హేమమాలినిని కౌగిలించుకునే సన్నివేశాల కోసం మరిన్ని టేకులు తీసుకోవాలని కోరుతూ ధర్మేంద్ర లైట్బాయ్లకు డబ్బులు ఇచ్చేవారని ఒక సమయంలో మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ రోజుల్లో ఆయన ఇందుకోసం రూ.2000 వరకు ఖర్చు చేశారని ప్రచారం జరిగింది.
హేమమాలినిని వివాహం చేసుకోవాలన్న ధర్మేంద్ర కోరికను ఆయన మొదటి భార్య అంగీకరించలేదు. దీంతో, అప్పట్లో మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ధర్మేంద్ర ఇస్లాం మతం స్వీకరించి, దిలావర్ ఖాన్ పేరుతో 1980లో హేమమాలినిని వివాహం చేసుకున్నారని పెద్ద ఎత్తున రిపోర్టులు వచ్చాయి. ఒక భార్య ఉన్నప్పుడు రెండో వివాహానికి ఇస్లాం చట్టం అనుమతిస్తుందనే కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ సమయంలో కథనాలు పేర్కొన్నాయి.ఈ వివాహం ఆయన మొదటి కుటుంబంపై, ముఖ్యంగా సన్నీ డియోల్ – బాబీ డియోల్లపై ప్రభావం చూపింది. కొంతకాలం ధర్మేంద్ర ఇద్దరి కుటుంబాలకూ దూరంగా ఉండాల్సి వచ్చినట్లు చెబుతారు. ప్రకాష్ కౌర్ ఎప్పుడూ బహిరంగంగా ధర్మేంద్రపై విమర్శలు చేయలేదు. “ధర్మేంద్ర మంచి తండ్రి, తన బాధ్యతలను నిర్వర్తిస్తాడు. కానీ ఒక భార్యగా నా బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు” అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.