Gandhi Jayanti | మహర్షులకు మంత్ర శక్తి ఉన్నట్టే.. మహాత్ముడికి మాట శక్తి ఉంది. ఆయన పలుకు పదునైన రామబాణం. నేరుగా మనసును తాకుతుంది. ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఆచరణ దిశగా అడుగులు వేయిస్తుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో జాతిమొత్తం ఆ మాటకే కట్టుబడి ఉంది. నిరాహారదీక్ష చేయమంటే చేసింది. నూలు వడకమంటే వడికింది. ఖద్దరు ధరించమంటే ధరించింది. జైలుకెళ్లమంటే వెళ్లింది. నిరసనలు తెలపమంటే తెలిపింది. మహోద్ధృతంగా సాగిపోతున్న ఉద్యమాన్ని ఆపేయమని చెప్పగానే.. ఠక్కున ఆపేసింది.
అదీ గాంధీజీ మాటకున్న శక్తి. ఆ వాక్శుద్ధి నిబద్ధతతో వస్తుంది. సత్యవాక్య పాలనతో ప్రామాణికత సాధిస్తుంది. నాయకత్వగుణంతో పదునుదేలుతుంది. అలా అని, ఆ మాటల్లో సుదీర్ఘ సమాసాలు ఉండవు. సంస్కృత పదాల పోహళింపూ కనిపించదు. ఆంగ్లపదాలు గుప్పించిన దాఖలాలు ఉండవు. భాష.. సరళంగా ఉంటుంది. ఆయన కొల్లాయిలా, ఆయన జీవన విధానంలా. భావానికి మాత్రం ఎంతో లోతు. ఆయన బోసి నవ్వులా, ఆయన చురుకైన చూపులా. కస్టమర్ సేవలు మొదలు సాంకేతిక పరిజ్ఞానం వరకు మహాత్ముడు చర్చించని విషయం లేదు. మానవ హక్కుల నుంచి జీవరాశి కారుణ్యం వరకూ ప్రబోధించని సత్యం లేదు.రామాయణ-భారత- భగవద్గీతలే కాదు.. బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం.. ప్రతి ధర్మంలోని మంచిని ఒడిసిపట్టి అందించారు. చెప్పిందే చేశారు. చేసిందే చెప్పారు. కాబట్టే, ఆయన జీవితమే ఆయన సందేశమైంది. ఆయన ప్రతి వాక్కు ఒక సూక్తిగా నిలిచిపోయింది. మంచిచెడుల మధ్య తూకం వేయాల్సి వచ్చినప్పుడు.. ధర్మాధర్మ విచక్షణ సన్నగిల్లినప్పుడు.. ఏదారి ఎంచుకోవాలో తెలియనప్పుడు, రెండు వాదాల్లో దేనికి ఓటేయాలో అర్థం కానప్పుడు.. ఆయనను తలుచుకుంటే చాలు. నిజం నిగ్గుదేలుతుంది. అందులోనూ మనం సంధియుగంలో ఉన్నాం. మంచిని చెడు మింగేస్తున్న దశ. అజ్ఞానం జ్ఞానాన్ని ఆక్రమించేస్తున్న తరుణం. నైతికతను అనైతికత నమిలేస్తున్న పరిస్థితులు. ఇప్పుడు.. మహాత్ముడి అడుగుజాడలే మనకు దారిదీపాలు. బాపు మాటలే బంగారు బాటలు. ఆ విలువల యాత్రకు తగినంత ఆత్మబలాన్ని ఇవ్వమని ‘గాంధీ జయంతి’ సందర్భంగా ప్రార్థిద్దాం.
గుంపులో ఒకడివి అయినప్పుడు గుర్తింపు ఉండదు.
నీదైన భావజాలంపై నిలబడు, నీదైన వాదనతో తలపడు.
.. సమూహంలో ఉంటే సమస్యే ఉండదు. నలుగురితో కలిసి జిందాబాద్. నలుగురితో కలిసి ముర్దాబాద్. మనకంటూ సొంత గొంతుక ఉండదు. మనదైన వాదనతో పనిలేదు. మనకంటూ ఓ వ్యక్తిత్వమే అవసరం లేదు. మనమిక రబ్బరు స్టాంపులం, మరబొమ్మలం. ఆ భావ దారిద్య్రమే వద్దంటాడు మహాత్ముడు.
మౌనాన్ని వీడటం అనివార్యం అయినప్పుడే మాట్లాడు!
..ఎటు చూసినా మాటలే. ఎవరు నోరు తెరిచినా పదాడంబరమే. మాటలు హద్దులు దాటితే తిట్లు. తిట్లు శ్రుతిమించితే బూతులు. హింసకు అదే ఆరంభం. నాలుకలు కోసుకుంటారు. కుత్తుకలు తెంపుకొంటారు. రక్తం పారుతుంది. సంస్కారం సమాధి అవుతుంది. అంత ఉత్పాతం అవసరమా? మాటను పొదుపుగా వాడదాం! హితంగా, మితంగా, సర్వజన సమ్మతంగా మాట్లాడదాం!
వర్తమానంలో నువ్వు చేసే పనులపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
పైపైకి కర్మసిద్ధాంత మూలభావనలా అనిపిస్తున్నా.. మహాత్ముడి ఆలోచన మరింత విస్తృతమైంది. మంచి చేస్తే మంచే జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. మనం భూమి పొరలను ప్లాస్టిక్ పొరలతో నింపేస్తే.. రేపటి తరాలకు ఆ వ్యర్థాలే మిగుల్తాయి. నీటిని వృథాగా వాడేస్తే.. భవిష్యత్ తరాలకు కరువులు తప్పవు. ఇదీ హెచ్చరిక!
నిన్ను నువ్వు చూసుకోవాలన్నా..
నిన్ను నువ్వు మరిచిపోవాలన్నా..
సేవను మించిన మార్గం లేదు.
నలుగురికీ ఉపయోగపడని జీవితం వ్యర్థం. నలుగురితో పంచుకోని సంపద అనర్థం. నీ నుంచి సాయం పొందినవారి కళ్లలో వెలుగు అవుతావో, నీ చేతిలో దోపిడికి గురైనవారి బతుకుల్లో చీకటి అవుతావో.. నిర్ణయించుకో. సేవా మంత్రాన్ని జపించినవారి జీవితం ఆనందకరం.
సహనాన్ని కోల్పోవడం అంటే.. సగం ఓటమిని అంగీకరించడమే.
..చాలామంది అసహనంతో రగిలిపోతుంటారు. ఆలస్యాన్ని తట్టుకోలేరు. అవరోధాల్ని భరించలేరు. ఓటమి కారణాల్ని విశ్లేషించలేరు. నీ కండబలమో, గుండెబలమో కాదు.. నీ సహనమే నిన్ను విజేతను చేస్తుంది.
సహనంలేని యోధుడు సగం పరాజితుడు.
అహింసా మార్గంలోనూ ప్రపంచాన్ని కదిలించవచ్చు.
.. సత్యాన్ని మించిన ఆయుధం లేదు. అహింసకు సాటి వచ్చే ఉద్యమం లేదు. అందుకు తెలంగాణ పోరాటమే నిలువెత్తు సాక్ష్యం. నిరసనలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలతోనే కేసీఆర్ ప్రజల ఆకాంక్షను నిజం చేశారు. ఇది అచ్చమైన గాంధేయవాదం, అసలుసిసలు గాంధీ మార్గం.
గిరిగీసుకుని బతికే ఏ సంస్కృతీ ఎక్కువ కాలం మనజాలదు.
నాలుగు భావాలు, పది అభిప్రాయాలు, అనంతమైన ఆలోచనలు కలిస్తేనే ఓ సంస్కృతి. అంతేకానీ, ఒక్క భావాజాలానికే పరిమితమై, దానిచుట్టూ గీత గీసుకుని.. అదే సర్వోన్నతం అనుకుంటే పతనం వైపు అడుగులు వేసినట్టే. ఆ సంస్కృతికి అల్పాయువే.
ప్రపంచాన్ని మార్చాలనుకుంటే.. ముందు నువ్వు మారాలి!
ఏ మార్పూ యాదృచ్ఛికం కాదు. ఏ పరిణామం అయాచితం కాదు. దాని వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది. త్యాగ ఫలమూ ఉంటుంది. ఆ మార్పు తీర్పరులు ముందుగా తమను తాము మార్చుకున్నారు.
నీ అనుమతి లేకుండా నిన్నెవరూ బాధపెట్టలేరు.
ఓసారి బుద్ధుడు శిష్యులతో కలిసి ప్రయాణిస్తుంటే.. ఎవరో తప్పుగా మాట్లాడతారు. శిష్యులంతా బాధపడిపోతారు. బుద్ధుడి మొహం మీద మాత్రం చిరునవ్వు చెదరలేదు. ‘మీరు ఆ తిట్లను స్వీకరించారు. కాబట్టి బాధపడుతున్నారు. నేను స్వీకరించలేదు కాబట్టి, ఆ మాటలు నన్ను బాధించవు’ అంటాడు తథాగతుడు. మహాత్ముడి మాటల అంతరార్థమూ ఇదే.
నువ్వు ఆలోచించేది, మాట్లాడేది, ఆచరించేది.. ఈ మూడూ ఒక్కటే కావడం ఆనందం.
మనం మనలా ఉన్నప్పుడే.. ఇదంతా సాధ్యం అవుతుంది. గాంధీ మార్గంలో నడవాలంటే.. ముసుగులు తీసేయాలి. అహాలు వదిలేయాలి. అబద్ధాలు బద్దలుకొట్టాలి. అప్పుడిక.. మన జీవితం తెరిచిన పుస్తకంగా మారుతుంది.
మన జీవితమే మన సందేశం అవుతుంది.
బలవంతుడు మాత్రమే క్షమించగలడు. బలహీనుడికి అదో సాకు మాత్రమే.
చేతకాక, చేవచచ్చి, ఓడించలేక ‘క్షమించేశాను పో’ అనుకోవడం క్షమాగుణం కాదు, ఫక్తు పలాయన వాదం. చేతగానివాడి లక్షణం. పరోక్షంగా ఇది పిరికితనమే. ఓడించే సత్తా ఉన్నా.. అపకారం తలపెట్టకపోవడమే అసలైన క్షమాగుణం.
మానవతను శంకించకండి. అదో సువిశాల సముద్రం. ఓ మూలన కాలుష్యం ఉన్నంత మాత్రాన.. సంద్రమంతా కలుషితమైనట్టు కాదు.
ఆశావాదమే మనిషిని బతికిస్తుంది, సమాజాన్ని నడిపిస్తుంది. నిజమే హింస పెరుగుతున్నది. అపనమ్మకాలు ప్రబలుతున్నాయి. అంతమాత్రాన అంతా చెడే అనుకోవడానికి వీల్లేదు. మన చుట్టూ మంచి, మానవత్వం ఉన్నాయి. కాబట్టి, నిరాశ వద్దు.
Mahatma Gandhi8
మన సంపాదనను ఆహారానికి మాత్రమే పరిమితం చేస్తే.. ప్రపంచంలో దేనికీ, ఎవరికీ కొరత ఉండదు. జీవితాన్ని ఆనందంగా గడపడానికి తగిన సమయమూ ఉంటుంది.
ఎంత గొప్ప మాట! మనిషి అర్థంలేని పరుగులో కస్తూరి మృగంతో పోటీపడుతున్నాడు. తన కోసం, తన పిల్లల కోసం, పిల్లల పిల్లల కోసం, ఆ పిల్లల పిల్లల కోసం.. ఏడు తరాలకు సరిపడా సంపాదించినా అసంతృప్తే. దీంతో సమాజంలో అంతరాలు పెరిగిపోతున్నాయి. సంపన్నుడు మరింత సంపన్నుడు అవుతున్నాడు. పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు. డబ్బు మూటల మధ్య అతనేమైనా సంతోషంగా ఉంటున్నాడా అంటే అదీ లేదు.
బంధాలకు బీటలుపడుతున్నాయి. అవును, మనకంటూ ఓ పరిమితి విధించుకోవాల్సిందే.