 
                                                            PKL 2025 : ప్రోకబడ్డీ లీగ్ పన్నెండో సీజన్లో దబాంగ్ ఢిల్లీ (Dabang Delhli) ఛాంపియన్‌గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పుణెరి పల్టన్(Puneri Paltan)కు షాకిస్తూ మూడు పాయింట్ల తేడాతో జయభేరి మోగించింది. చివరి రెండు నిమిషాల్లో ఇనాందార్ రెండు పాయింట్లు సాధించగా స్కోర్లు సమం అవుతాయనిపించింది. కానీ, తర్వాతి రైడ్‌లో ఫజల్ అత్రాచెలీ పట్టేయడంతో ఢిల్లీకి విజయం సొంతమైంది. దాంతో.. రెండోసారి విజేతగా నిలవాలనుకున్న ఆ జట్టు కథ రన్నరప్‌తోనే ముగిసింది.
మూడు నెలలు అభిమానులు అలరించిన ప్రోకబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ టైటిల్ కొల్లగొట్టింది. ఎనిమిదో సీజన్లో కప్ తన్నుకుపోయిన ఆ టీమ్ ఇప్పుడు రెండోసారి విజేతగా నిలిచింది. రెండు సమఉజ్జీలైన ప్రత్యర్ధులు కావడంతో మ్యాచ్ ఆసాంతం హోరాహోరీగా సాగింది. తొలి అర్ధ భాగంలోనే పుణెరిని ఆలౌట్ చేసిన ఢిల్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో అర్ద భాగంలో పుంజుకున్న పుణెరి టాకిల్ పాయింట్లతో గుబులు రేపింది. కానీ, చివరకు కూల్‌గా ఆడిన ఢిల్లీనే విజయం వరించింది.
PRESENTING THE #PKL12 CHAMPIONS 👉 𝐃𝐀𝐁𝐀𝐍𝐆 𝐃𝐄𝐋𝐇𝐈 𝐊.𝐂. 🏆💥#ProKabaddi #GhusKarMaarenge #PuneriPaltan #DabangDelhiKC pic.twitter.com/1lCdFqXnoh
— ProKabaddi (@ProKabaddi) October 31, 2025
లీగ్ దశలో అత్యధిక పాయింట్లతో ప్లే ఆఫ్స్ దూసుకెళ్లిన ఢిల్లీ.. క్వాలిఫయర్ 1లో పుణెరి పల్టన్‌ను ఓడించి ఫైనల్ చేరింది. మరోవైపు.. క్వాలిఫయర్ 2లో తెలుగు టైటాన్స్‌కు చెక్ పెట్టిన పల్టన్ టీమ్ ఫైనల్లో మాత్రం ఢిల్లీని దాటలేకపోయింది. దాంతో..10వ సీజన్ ఛాంపియన్ పుణెరి పల్టన్‌కు నిరాశ తప్పలేదు. పుణెరి పల్టన్ జట్టులో ఆదిత్య షిండే సూపర్ 10 సాధించగా.. ఢిల్లీ నుంచి నీరజ్ నర్వాల్ 9 రైడ్ పాయింట్లతో మెరిశాడు.
 
                            