 
                                                            Home Remedies Using Onions | ఉల్లిపాయలను మనం రోజూ వంటల్లో వాడుతుంటాం. అనేక రకాల కూరల్లో ఉల్లిపాయలను వేస్తుంటారు. ఉల్లిపాయలను వేస్తే వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఉల్లిపాయలను పచ్చిగా కూడా తింటుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం ఉల్లిపాయలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఉల్లిపాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల ఉల్లిపాయలను రోజూ పచ్చిగా తింటే అనేక లాభాలను పొందవచ్చు. అయితే ఉల్లిపాయలను పలు విధాలుగా ఉపయోగించడం వల్ల కొన్ని రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. పలు ఇంటి చిట్కాల్లో ఉల్లిపాయలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు నయం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోనూ ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అందుకుగాను ఉల్లిపాయలతో పలు పదార్థాలను కలిపి వాడాల్సి ఉంటుంది.
హైబీపీని తగ్గించడంలో ఉల్లిపాయలు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకు గాను ఉల్లిపాయ రసం, తేనెలను ఒక టీస్పూన్ చొప్పున తీసుకుని కలిపి రోజూ ఉదయం, సాయంత్రం సేవిస్తుండాలి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి మేలు జరుగుతుంది. భోజనంలో భాగంగా పచ్చి ఉల్లిపాయను 30 గ్రాముల మోతాదులో తింటుండాలి. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఉల్లిపాయలు, కీరదోస, టమాటాలు, క్యారెట్, కొత్తిమీరలను తీసుకుని కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ లా చేయాలి. అందులో నిమ్మరసం పిండి రోజుకు ఒక్కపూట తీసుకోవాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి.
ఉల్లిపాయల రసం 2 టీస్పూన్లు, తేనె 2 టీస్పూన్లు, అల్లం రసం 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా కలిపి భోజనం తరువాత రోజూ తీసుకోవాలి. ఇలా రోజూ రాత్రి పూట తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దగ్గు, జలుబు తగ్గుతాయి. ముఖ్యంగా ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా ఉన్న వారికి మేలు జరుగుతుంది. అలాగే ఈ చిట్కాను పాటిస్తుంటే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఆకలి పెరుగుతుంది. ఉల్లిపాయల రసం 1 టీస్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని రెండింటినీ కలిపి రోజుకు 3 పూటలా తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దగ్గు, జలుబు తగ్గుతాయి. టాన్సిల్స్ ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. టాన్సిల్స్ వాపులను తగ్గించుకోవచ్చు.
ఆవనూనెతో ఉల్లిపాయలను కలిపి మెత్తగా దంచాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాయాలి. ఇలా రోజూ చేస్తుంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. కొద్దిగా నెయ్యిని వేడి చేసి దాన్ని చర్మంపై గడ్డలు ఉండే చోట రాయాలి. అనంతరం ఉల్లిపాయలను ఉడికించి దంచి ఆ మిశ్రమాన్ని ఆయా భాగాలపై రాయాలి. తరువాత కట్టు కట్టాలి. దీంతో గడ్డలు మెత్తబడి పగిలిపోతాయి. సమస్య తగ్గుతుంది. అలాగే ముక్కు నుంచి రక్తం కారే సమస్య ఉన్నవారు ఉల్లిపాయలను దంచి రసం తీసి దాన్ని రెండు చుక్కల చొప్పున ముక్కు రంధ్రాల్లో వేస్తుండాలి. దీంతో సమస్య నుంచి బయట పడవచ్చు. చెవినొప్పిని తగ్గించడంలోనూ ఉల్లిపాయలు బాగానే పనిచేస్తాయి. ఇందుకు గాను ఉల్లిపాయల రసాన్ని వేడి చేసి 2 లేదా 3 చుక్కల చొప్పున చెవుల్లో వేయాలి. ఇలా చేస్తుంటే సమస్య తగ్గిపోతుంది. పాదాల పగుళ్లపై ఉల్లిపాయలను మర్దనా చేస్తుంటే సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా అనేక రకాలుగా ఉల్లిపాయలను ఇంటి చిట్కాల్లో ఉపయోగించుకోవచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
 
                            