 
                                                            Green Chilli Vs Red Chilli | మిరపకాయలను మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. కొందరు పచ్చి మిర్చిని ఎక్కువగా వాడుతారు. కొందరు ఎండు మిర్చిని లేదా ఎండు కారాన్ని వాడుతారు. వేటిని వాడినా కూరల్లో వేస్తే మాత్రం కారంగానే ఉంటాయి. అయితే పచ్చి మిర్చి లేదా ఎండు మిర్చి.. రెండింటిలో ఏవి మనకు ఎక్కువ లాభాలను, పోషకాలను అందిస్తాయి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి మిర్చి లేదా ఎండు మిర్చి ఏదైనా సరే పోషకాలు అధికంగానే ఉంటాయి. కానీ పచ్చి మిర్చిలో పోషకాల శాతం కాస్త ఎక్కువగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కనుక పోషకాలు అధికంగా కావాలంటే పచ్చి మిర్చిని తినాల్సి ఉంటుంది. అయితే పచ్చి మిర్చిని నేరుగా తినకూడదు. ఉడకబెట్టి తినాలి. దీని వల్ల ఎక్కువ పోషకాలను పొందవచ్చని అంటున్నారు.
పచ్చి మిర్చిలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయం చేస్తుంది. దీని వల్ల చర్మం సురక్షితంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ సి వల్ల మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల ఐరన్ లోపం సమస్యను తగ్గించుకోవచ్చు. పచ్చి మిర్చిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు అసలు ఉండవు. కనుక పచ్చి మిర్చిని తింటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. పచ్చి మిర్చిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది.
పచ్చిమిర్చిలో క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది శరీర మెటబాలిజంను పెంచుతుంది. దీని వల్ల కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇక ఎండు మిర్చి లేదా ఎండు కారం తింటే విటమిన్ ఎ ను అధికంగా పొందవచ్చు. మిర్చి ఎరుపు రంగులోకి మారడం వల్ల అందులో బీటా కెరోటిన్ శాతం పెరుగుతుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. విటమిన్ ఎ వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఎండు మిర్చిలో క్యాప్సెయిసిన్ శాతం పెరుగుతుంది. ఇది మరింత మెరుగ్గా మెటబాలిజంను పెంచి ఇంకా ఎక్కువగా కొవ్వు కరిగేలా చేస్తుంది. అలాగే నొప్పుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది.
ఎండు మిర్చిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త నాళాలను వెడల్పుగా మారుస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. ఎండు మిర్చిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. కనుక ఎండు మిర్చిని తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అయితే ఎండు మిర్చి లేదా పచ్చి మిర్చి రెండూ మనకు లాభాలను అందించేవే. కానీ విటమిన్ సి, చర్మ సంరక్షణ, జీర్ణ సమస్యలను తగ్గించుకోవడం కోసం, ఇతర పోషకాలకు గాను పచ్చిమిర్చిని తినాలి. అదే విటమిన్ ఎ, కంటి చూపు, రోగ నిరోధక శక్తి, నొప్పులకు గాను ఎండు మిర్చిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వీటిని తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
 
                            