మనదేశంలో ఆహారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. భోజనంగానే కాకుండా.. ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాల్లోనూ ఆహారం కీలకంగా కనిపిస్తుంది. విలువలు, సంస్కృతి, సౌకర్యంతోపాటు గుర్తింపును కూడా ప్రతిబింబిస్తుంది. అయితే, అదే ఆహారం.. ‘జెనరేషన్ జెడ్’ దంపతుల మధ్య గొడవలకు కారణం అవుతున్నది. బంధాలను విచ్చిన్నం చేస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా.. వెగన్లు, శాకాహారులు, మాంసాహారులు ఉంటారు. కానీ, మనదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శాకాహారులైనా.. కొందరు కోడిగుడ్లతో చేసిన కేక్‌ను ఇష్టంగా తింటారు. మరికొందరు మాంసాహారులు.. కొన్ని ప్రత్యేక రోజుల్లో మాంసాన్ని దూరం పెడుతారు. అప్పుడప్పుడూ మాంసం తినడం, కొన్నిరకాల పదార్థాలనే తీసుకోవడం లాంటివాళ్లూ ఇక్కడ కనిపిస్తారు. అయితే, ఇలాంటి విభిన్నమైన ఆహారపు అలవాట్లు.. ‘జనరేషన్ జెడ్’ దంపతుల మధ్య గొడవలు సృష్టిస్తున్నాయట. దంపతుల్లో ఒకరు శాకాహారి.. మరొకరు మాంసాహారి అయినప్పుడు.. ఇబ్బంది కలుగుతున్నదట.
దాంతో ఒకే ఇంట్లో ప్రతిరోజూ రెండు వేర్వేరు వంటకాలను సిద్ధం చేయాల్సి వస్తున్నది. గృహిణులు సర్దుకుపోతున్నా.. ఉద్యోగాలు చేసేవారు అవస్థ పడుతున్నారు. ఇక ఉమ్మడి కుటుంబమైతే.. ఈ వంటల జాబితా మరింత పెరుగుతున్నది. అంతేకాకుండా.. తాము కోరుకున్న ఆహారం తినలేకపోతున్నామని కూడా నవతరం ఇల్లాళ్లు చెబుతున్నారు. అదే సమయంలో పెద్దవాళ్లు ఈ ఆహారపు గొడవలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇదేం పెద్ద విషయం కాదని కొట్టిపారేస్తున్నారు. ఆహారం విషయంలో సర్దుబాటు చేసుకోవడానికి ఈ తరం ఇష్టపడటం లేదని చెబుతున్నారు.
‘జెన్-జీ’ దంపతులు ఇలా ఆహారం విషయంలో రాజీపడటం, గొడవపడటం.. వారి బంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి భోజనం విషయంలోనే కాదు.. విందులు, రెస్టారెంట్లకు వెళ్లినప్పడు, ఇంటి సామగ్రి కొనుగోలు విషయాల్లోనూ తగాదాలకు దారితీయవచ్చని అంటున్నారు. అయితే, ఒకరి ఇష్టాలను గౌరవించడం, కలిసి తినడం లాంటి చిన్న విషయాలే.. వారిలో భావోద్వేగ సంబంధాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. అందుకే.. ఒకరి అభిరుచులకు మరొకరు విలువ ఇచ్చి, మధ్యేమార్గాన్ని ఫాలో అయిపోతే.. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని సూచిస్తున్నారు. ఇలాంటి దంపతుల్లో భోజనం దాటవేయడం, అసమతుల్య ఆహారం తీసుకోవడం కనిపిస్తున్నదట.
ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదట. అందుకే.. ఆహార వ్యత్యాసాల విషయంలో ఎదుటివారి భావోద్వేగాలను, ఆహారపు అలవాట్లను గౌరవించాలని చెబుతున్నారు. ఒకరినొకరు మార్చుకోవడానికి ప్రయత్నించకుండా.. ఇద్దరి అభిరుచులకూ డైనింగ్ టేబుల్‌పై చోటు కల్పించాలని సూచిస్తున్నారు. మధ్యేమార్గంగా ఇద్దరూ ఇష్టపడే ఉమ్మడి ఆహార వ్యవహారాలను సృష్టించుకోవాలని చెబుతున్నారు. అదే సమయంలో వంటలకు ఒక్కరినే బాధ్యులుగా చేయకుండా.. కలిసి వంట చేయడం ద్వారా భాగస్వామిపై భారం తగ్గడంతోపాటు ఇద్దరి మధ్యా బంధం మరింత బలపడుతుందని సలహా ఇస్తున్నారు.