Tea Ceremony | తేనీరు సేవించడానికి భారతీయులకు సందర్భ శుద్ధితో పనిలేదు. కొంతమంది ముంచుకొచ్చే నిద్రను ఆపడానికి టీ తాగుతారు. ఇంకొందరు కొండెక్కిన కునుకును మళ్లీ కంటిమీదికి రప్పించడానికి టీ పుచ్చుకుంటారు. ఆకలిని అదిమిపెట్టడానికీ, ఆకలి పుట్టించడానికీ ఏకాక్షరి కావాలంటారు. వేడుక ఏదైనా వేడివేడి చాయ్ ఉంటే చాలు. మన సంగతి అటుంచితే జపనీయులు ‘తేనీటి పండుగ’ను ఘనంగా చేసుకుంటారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని సంప్రదాయబద్ధంగా పాటిస్తారు. ‘టీ సెర్మనీ’ పేరిట అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించి తేనీటి విందు ఇస్తారు. ఏడాది పొడవునా ఈ పండుగ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటుంది.
అక్టోబర్‌లో టీ పండుగ సందడి వాడవాడలా కనిపిస్తుంది. పండుగ అనగానే పదిమంది చేరి హడావుడిగా ఆటపాటల్లో మునిగిపోతారని ఊహించుకోకండి. ఈ తంతు అంతా సంప్రదాయబద్ధంగా సాగుతుంది. ఏకాక్షరి సేవనం కోసం ప్రత్యేకంగా ఇంట్లో ఒక గదిని కేటాయిస్తారు. ఆ గది ద్వారబంధం తక్కువ ఎత్తుతో ఉంటుంది. వచ్చిన అతిథులు తలదించుకొని లోనికి ప్రవేశించాలి. తమను ఆతిథ్యానికి పిలిచినవారికి మర్యాదపూర్వకంగా నమస్కరించడం ఇందులోని ఆంతర్యం! అంతేకాదు ఈ విందు ఇచ్చేవాళ్లు, వచ్చేవాళ్లు జపనీయుల సంప్రదాయ దుస్తులు కిమోనో ధరించాల్సిందే! గదిలోకి వచ్చిన వారికి ముందుగా రాజ్మాతో చేసిన తీపి పదార్థాన్ని ఇస్తారు. ఆ తర్వాత జపాన్‌కి ప్రత్యేకమైన మచ్చా టీని అందిస్తారు. తేనీటిని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ కులాసాగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తారు. దాదాపు 13వ శతాబ్దంలో మొదలైన ఈ తేనీటి పండుగను జపనీయులు నేటికీ విజయవంతంగా కొనసాగిస్తుండటం విశేషం.
బబుల్ టీ
కావాల్సినవి: నీళ్లు: 100 మి.లీ., టీపొడి: ఒక టీ స్పూన్, చక్కెర: ఒక టేబుల్ స్పూన్, కండెన్స్డ్ మిల్క్: ఒక టేబుల్ స్పూన్, ఐస్ క్యూబ్స్: 3/4 కప్పు, ఫ్రూట్ పౌడర్: ఒక టేబుల్ స్పూన్, ఐస్‌క్రీమ్‌లో వేసుకునే పాపిన్ బబుల్స్: రెండు టీ స్పూన్లు.
తయారీ: ముందుగా నీళ్లు, టీ పొడితో డికాక్షన్ కాచుకోవాలి. దానిని బ్లెండర్లో పోసి అందులో చక్కెర, కండెన్స్డ్ మిల్క్, ఐస్ క్యూబ్స్, ఫ్రూట్ పౌడర్ వేసుకొని అన్నీ బాగా కలిసేలా తిప్పాలి. ఇప్పుడు గ్లాస్లో పాపిన్ బబుల్స్ వేసుకొని, అందులోకి బ్లెండ్ చేసిన ఐస్ టీ పోసుకుంటే తైవాన్ స్పెషల్ బబుల్ టీ సిద్ధం.
‘టీ’కా తాత్పర్యం
టీ తాగుతున్నప్పుడు గతం గురించి గానీ, భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా.. ఆ క్షణాన్ని లక్షణంగా ఆస్వాదించాలి. రుచికరమైన తేనీటిని సేవిస్తున్న సమయమే నిజమైన జీవితం!
n జపాన్ నానుడి
“Tea | ఎంత ఇష్టమైనా రోజులో 4 సార్లకంటే ఎక్కువ తాగకపోతేనే మేలు”
“Tea | విషం తిన్న వ్యక్తిని కాపాడిన ఛాయ్.. ఎక్స్పైరీ అయిన టీపొడి కూడా ఆరోగ్యమే !”
Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!