వాకింగ్.. వ్యాయామంలో ‘కింగ్’గా గుర్తింపు పొందింది. అనేక పరిశోధనల ఆధారంగా.. ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు నడకను మించింది లేదని తేలింది. అయితే.. దీని ప్రయోజనాలను పొందడానికి మైళ్లకు మైళ్లు నడవాల్సిన అవసరం లేదని మరొక అధ్యయనం తేల్చింది. నడక కోసం రోజుకు 11 నిమిషాలు కేటాయిస్తే.. ఆరోగ్యానికి భరోసా దక్కుతుందని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడిస్తున్నది. ఇందులోభాగంగా, మూడు కోట్ల మందికి సంబంధించిన 196 పీర్-రివ్యూడ్ ఆర్టికల్స్ నుంచి డేటాను విశ్లేషించారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి శారీరక శ్రమ, ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని పరిశోధకులు ప్రత్యేకంగా పరిశీలించారు. డేటాను విశ్లేషించిన తర్వాత అనేక ఆసక్తికర విషయాలను కనుగొన్నారు. వారానికి 75 నిమిషాలు చురుకైన నడకతో వ్యాయామం చేసేవారిలో ముందస్తు మరణాలు 23 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. వీరిలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 17 శాతం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏడు శాతం తగ్గుతుందని తేల్చారు.
వారానికి 75 నిమిషాలు అంటే.. రోజుకు కేవలం 11 నిమిషాలు స్థిరమైన వేగంతో నడవడం వల్ల.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, 11 నిమిషాలు దాటిన తర్వాత నడవడం మానేయాలని కాదనీ, రోజుకు కనీసం 5,000 అడుగుల కంటే ఎక్కువ నడిస్తేనే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఫిట్నెస్ కోసం నడక అలవాటు చేసుకోవాలనుకుంటే, రోజుకు 5,000 లకు పైగా అడుగులు వేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.