ఈ మధ్యకాలంలో జీవనశైలి వ్యాధి అయిన మధుమేహం విస్తృతి బాగా ఎక్కువైంది. మధుమేహుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. ఒకసారి మధుమేహం బారిన పడితే ఇక ఆ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ, కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే డయాబెటిస్ బారినపడిన వారిలో చాలామంది తమ పాత ఆహారపు అలవాట్లను మార్చుకుని ఒంట్లో షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.
సాధారణంగా మధుమేహం ఉన్నవాళ్లు తియ్యని ఆహార పదార్థాలు తినకూడదు. అందుకే వాటి జోలికి అస్సలు వెళ్లరు. అదేవిధంగా చాలామంది మధుమేహులు రైస్‌ను కూడా దూరం పెడుతారు. కొందరేమో ఒక్కపూటకే పరిమితం చేస్తారు. ఉదయం, రాత్రిళ్లు ఎక్కువగా చిరుధాన్యాలతో చేసిన వంటకాలు తీసుకుంటారు. జొన్న, సజ్జ, మక్కజొన్న, రాగులు, ఊదలు, కొర్రలు, అవిసెలు, అరికలు వంటి ధాన్యాలతో తయారు చేసిన వంటకాలకే తమ రోజువారీ మెనూలో సింహభాగం కేటాయిస్తారు.
అయితే, మక్కజొన్న మధుమేహులకు మంచిదే అయినా ఆ మక్కజొన్నలతో చేసే కార్న్ ఫ్లేక్స్ మాత్రం చాలా ప్రమాదకరమట. అందుకే మధుమేహులు తినకూడని ఆహార పదార్థాల్లో కార్న్ ఫ్లేక్స్ కూడా ఒకటిగా మారిపోయింది. కార్న్‌ఫ్లేక్స్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని చూడగానే ఎవరికైనా వెంటనే తినేయాలనే కోరిక కలుగుతుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారు మాత్రం వాటిని దూరం పెట్టడమే మంచిదట. ఎందుకంటే వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉంటుందట.
జీఐ విలువ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. అంటే మధుమేహం అదుపు తప్పుతుంది. అది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి మధుమేహులు కార్న్ ఫ్లేక్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..