సంపూర్ణ ఆరోగ్యానికి పరిపూర్ణ నిద్ర అవసరం. రాత్రిపూట తరచుగా మేల్కొంటూ, అసంపూర్తిగా నిద్రిస్తే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం. రోజులో ఎంతసేపు పడుకున్నామన్నది ముఖ్యం కాదు. రాత్రిపూట ఎంతబాగా నిద్ర పోయామన్నదే అసలు పాయింట్. చాలామంది రాత్రంతా పడుకున్నా.. తరచుగా నిద్ర మేల్కొంటూ ఉంటారు. ఇలాంటి నిద్ర ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. అకస్మాత్తుగా నిద్ర లేవడం, నిద్రలేమి లాంటి సమస్యలు.. గుండెకు ముప్పు తెస్తాయని హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట తరచూ నిద్ర లేస్తుంటే.. దానిని సాధారణ సమస్యగా చూడొద్దు. ఇలా చాలాసార్లు మేల్కొనడం.. ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ఇటీవల ప్రచురితమైన ఓ పరిశోధన చెబుతున్నది. ఇలాంటి నిద్ర సమస్యలు.. గుండె ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని అంటున్నది. నిద్రలో తరచుగా అంతరాయం కలుగుతుంటే.. అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉన్నదట. ఇది గుండె సమస్యలకు దారితీస్తుందట. ఇక నిద్రలో అంతరాయం కలగడం వల్ల మెదడు పనితీరుపైనా ప్రభావం చూపుతుందట. ఇందుకు కారణాలను పరిశోధకులు విశ్లేషించారు. రాత్రిపూట గాఢ నిద్రలో అనేక అవయవాలు విశ్రాంతి పొందుతాయి. తమను తాము రిపేర్ చేసుకుంటాయి. గుండె కూడా లయబద్ధంగా పనిచేస్తుంది.
రక్తపోటు సాధారణంగా సాగుతుంది. ఆ సమయంలో నిద్రకు పదేపదే అంతరాయం కలిగితే.. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. దీర్ఘకాలంలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక రాత్రిపూట అనేకసార్లు మేల్కొన్నట్లయితే.. మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. సాధారణ వ్యక్తుల్లో కన్నా.. స్లీప్ ఆప్నియా బాధితులు, మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటున్నదట.
ఈ ప్రమాదాన్ని నివారించడానికి.. పడుకునే ముందు ఫోన్లు, స్క్రీన్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలనీ, రాత్రిపూట కాఫీలు, టీలు తాగొద్దని సలహా ఇస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మానసిక ఒత్తిడికి గురికావద్దని అంటున్నారు. యోగాతోపాటు చిన్నపాటి నడక, ఎక్సర్సైజులు చేయడం వల్ల కమ్మటి నిద్ర పట్టే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.