వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. అందుకే, ఈ సమయంలో ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే.. అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉంటుంది. అందుకే, ఈ వానల సీజన్లో ఏయే పదార్థాలు తినాలో.. వేటిని పక్కన పెట్టాలో నిపుణులు చెబుతున్న సూచనలు..
వర్షాకాలం.. వివిధ అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమయంలో జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. ముఖ్యంగా, కడుపు సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సాధారణ సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.
వర్షాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. కాబట్టి, తేలికైన, సులభంగా జీర్ణమయ్యే తక్కువ వేయించిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇక గోరువెచ్చని నీరు, అల్లం టీ, తులసి (పవిత్ర తులసి) కషాయం లాంటివి జీర్ణవ్యవస్థకు ఉపశమనం కలిగించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాలానుగుణంగా దొరికే పండ్లు కూడా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలు.. పేగు ఆరోగ్యానికి మేలుచేసే బ్యాక్టీరియాను పెంచుతాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన పాలు, తులసి, అల్లం, వెల్లుల్లి, ఉసిరి లాంటివాటిని విరివిగా తీసుకోవాలి.
చాట్, పకోడా, పానీపూరి లాంటి స్ట్రీట్ ఫుడ్స్.. వర్షాకాలంలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు పెంచే ప్రదేశాలుగా మారతాయి. కాబట్టి, వీటికి దూరం ఉంటేనే మంచిది. ఇక పకోడీలు, సమోసాలు, చిప్స్ వంటి వేయించిన ఆహారాలు.. ఎక్కువ కారంగా ఉండే పదార్థాలు జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇతర కాలాల్లో ఆరోగ్యానికి మేలుచేసే ఆకుకూరలు.. వర్షాకాలంలో అనారోగ్యానికి కారణం కావొచ్చు. పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో సూక్ష్మక్రిములు, మట్టి కణాలు చేరే అవకాశం ఉంటుంది. వీటిని శుభ్రంగా కడిగి.. బాగా ఉడికించిన తర్వాతే తినాలి. పచ్చి కూరగాయలు, సలాడ్లను తగ్గించాలి. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చేపలు, రొయ్యలు లాంటివి త్వరగా పాడవుతాయి. వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, వర్షాకాలంలో వీటిని దూరం పెట్టాలి.