కృత్రిమ మేధ (ఏఐ)ను పరిమితికి మించి వాడితే.. మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. దీర్ఘకాలంలో మనిషి ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నదట. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. సర్వేలో భాగంగా 54 మందిని ఎంపిక చేశారు. ఒక్కొక్కరితో మూడేసి వ్యాసాలను రాయించారు. మొదటిసారి వారినే సొంతంగా ఆలోచించి రాయమని చెప్పారు. రెండోసారి గూగుల్లో వెతికి.. ఆ తర్వాత, ఏఐ సాయంతోనూ వ్యాసాలను రాయించారు. ఈ సందర్భంగా వారి మెదడులో జరిగే ఎలక్ట్రానిక్ కార్యకలాపాలను పరిశీలించారు.
ఆశ్చర్యంగా.. సొంతంగా ఆలోచించి వ్యాసాలు రాసినప్పుడు మెదడు ఎక్కువ ఉత్సాహంగా పనిచేసినట్టు కనుగొన్నారు. మెదడు పనితీరు కూడా మెరుగుపడ్డట్టు గుర్తించారు. ఇక గూగుల్లో వెతికినప్పుడు ఆ ఉత్సాహం తగ్గినట్టు కనిపిస్తే.. ఏఐ సాయంతో వ్యాసం రాసేటప్పుడు మెదడు ప్రభావం ఏమాత్రం లేనట్టు చెప్పుకొచ్చారు. దీర్ఘకాలంలో ఈ అలవాటు మెదడుకు చేటు చేస్తుందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. సరికొత్త సాంకేతికత ఎప్పుడు వచ్చినా, మనిషి సామర్థ్యాన్ని దెబ్బతీస్తూనే ఉన్నదని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
‘క్యాలిక్యులేటర్’ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. విద్యార్థులు చేతితో లెక్కలు చేయడం తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు. దీర్ఘకాలంలో చిన్నచిన్న లెక్కలను కూడా సొంతంగా చేసుకోలేని పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. ఏఐ కూడా ఈ విధంగానే మనుషుల మెదడుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. కాబట్టి, ఏఐని పరిమితంగానే వాడుకోవాలని వారు సూచిస్తున్నారు.