ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేస్తున్నారా? అయితే, మీ మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉన్నదట. ‘అల్పాహారం-మానసిక ఆరోగ్యం’పై చేసిన ఓ సర్వే.. ఈ విషయాలను వెల్లడిస్తున్నది. ‘హాంకాంగ్ యూత్ ఎపిడెమియోలాజికల్ స్టడీ ఆఫ్ మెంటల్ హెల్త్’ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందుకోసం 15 నుంచి 24 ఏళ్ల వయసుగల 3,154 మందిని ఎంపిక చేశారు. వీరి రోజూవారి ఆహార అలవాట్లను పరిశీలించారు. ప్రతిరోజూ ఉదయం ఏదో ఒకటి తిన్నవారితో పోలిస్తే.. అల్పాహారం దాటవేసినవారు ఎక్కువ ఉద్రేకంతో, ఆందోళనతో, నిరాశతో కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 85% మంది ప్రతిరోజూ లేదా అడపాదడపా ఏదో ఒక అల్పాహారం తీసుకున్నారు.
మిగిలిన 15% మంది బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తిగా దాటవేశారు. ఈ సందర్భంగా అల్పాహారం తీసుకోని వారిలో శ్రద్ధ తగ్గిపోవడం, స్వీయ నియంత్రణను కోల్పోవడం లాంటి సమస్యలను గుర్తించినట్లు అధ్యయనకారులు చెబుతున్నారు. ఇక అల్పాహారం దాటవేసేవారు తక్కువ ఉత్పాదకత కలిగి ఉన్నారని, పేలవమైన పనితీరును కనబర్చినట్లు గుర్తించారు. ఉద్యోగాలలోనూ తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నారని నివేదించారు. బ్రేక్‌ఫాస్ట్‌ను దాటవేయడం వల్ల మధ్యాహ్నం వరకే నిస్సత్తువ ఆవహిస్తుందనీ, దాంతో దేనిమీదా శ్రద్ధ పుట్టదని చెబుతున్నారు.
అందుకే, ఏ రకమైన ఆహారం, ఎంత పరిమాణంలో తింటారనే విషయాలతో సంబంధం లేకుండా.. ఉదయంపూట ఏదో ఒకటి తినడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక అల్పాహారం వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలతోపాటు శారీరక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత.. మధ్యాహ్నంపూట తక్కువ కేలరీలు తీసుకుంటారు. దాంతో బరువు అదుపులో ఉంటుంది. రక్తంలోనూ చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.