శనివారం 08 ఆగస్టు 2020
Komarambheem - Jun 25, 2020 , 00:11:37

అకాడి వేడుకలకు వేళాయె..

అకాడి వేడుకలకు వేళాయె..

ఆదివాసుల ఆచార వ్యవహారాలే వేరు.. చినుకు రాలినా.. గరిక మొలిచినా.. దుక్కి దున్నినా.. విత్తు నాటినా.. పంట పండినా.. చివరికి ఆ పంట ఇంటికొచ్చినా పండుగే.. అడవి తల్లిని నమ్ముకొని పోడు వ్యవసాయం చేసే గిరిజనులు.. తొలకరి జల్లులు పడుతున్న సమయంలో విత్తనాలు సరిగ్గా మొలకెత్తాలని.. పశువులకు మేత దొరకాలని.. అడవిలోకి వెళ్లే తమకు, సాధు జంతువులకు క్రూరమృగాల వల్ల ఎలాంటి ప్రమాదం కలుగకూడదని చేసే తొలి పండుగే అకాడి పేన్‌.. ఆషాఢ మాసంలో నెలవంక కనిపించిన తర్వాత ఈ వేడుకలకు శ్రీకారం చుడుతారు.  నేటి నుంచి పల్లె పల్లెనా సందడి కనిపించనుండగా, దండారీ నృత్యాలతో ఊరూవాడా హోరెత్తనున్నది.   - కెరమెరి

కెరమెరి: వానకాలం సీజన్‌ బాగుండాలని, ప శువులకు రోగాలు రాకుండా, అడవి జంతువుల నుంచి ఎలాంటి కీడు వాటిల్లకుండా ఆదివాసులు అడవి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాజుల్‌పేన్‌గా అడవుల్లో కొలువైన దేవతకు ప్రజలందరూ సామూహిక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం అక్కడే వంటలు చేసి సహపంక్తి భోజనం చేస్తారు. పాడిపశువులు పెం పొందాల ని, రక్షణ గీత గీసి పశువులను  దాటిస్తారు. అనంతరం గ్రామంలోకి వచ్చి ఏత్మసార్‌పేన్‌కు పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అకాడి పూజల అనంతరం గ్రామాల్లో దండారీ సంబురాలు ప్రారంభమవుతాయి. గురువారం చౌపన్‌ గూడలో వేడుకలు నిర్వహించనున్నారు.
రాజుల్‌ పేన్‌ పూజ ప్రత్యేకం..
అడవిదేవతగా కొలిచే ఆదివాసీల రాజుల్‌పేన్‌. పాడిపశువులకు రక్షణ ఇచ్చే దేవతగా కొనియాడుతారు. యేటా ఆషాఢ మాసంలో నెలవంక కనిపించిన నాటి నుంచి పౌర్ణమి వరకు అకాడి పండుగ ను జరుపుకోవడం ఆదివాసుల ఆనవాయితీ. ప్ర తి గ్రామంలో జరుపుకునే మొదటి పండుగ ఇదే. 
పశుకాపరులకు పెట్టే భోజనం..  
అకాడి వేడుకల్లో పూజ చేసిన అనంతరం తయారు చేసిన నైవేద్యం దేవుడికి సమర్పిస్తారు. ఆతర్వాత పశువులను మేపే కాపరులకు ముం దుగా భోజనం అందిస్తారు. దేవుని ప్రసాదంగా వారు తిన్న తర్వాతే గ్రామస్తులందరూ సహపంక్తి భోజనం చేయడం ఆనవాయితీ. దేవుడి ఆజ్ఞతోనే తమ పశువులను కాపరులు సురక్షితంగా ఇంటికి తీసుకొస్తారని ఆదివాసుల నమ్మకం.
ఆ రోజుతోనే ఆరంభం..
అడవిలోని చెట్లు, ఆకులు దేవుని వరంగా ఆదివాసులు కొలుస్తారు. అకాడిపేన్‌ పూజ చేశాకే టేకు ఆకులను సేకరించడం ప్రారంభిస్తారు. అంతవరకు ఎవ్వరూ వాటి జోలికి వెళ్లరు. ఒకవేళ పూజకు ముందు ఎవరైనా ఆకులను తెంపితే అడవిదేవత ఆగ్రహించి పాడిపశువులకు కీడు వాటిల్లుతుందని వారి నమ్మకం.
భోజనమే వారికి మహాప్రసాదం..
గ్రామంలో అకాడి పండుగ జరిపేముందు అందరూ ఒక్కదగ్గరగా కూర్చొని పండుగ తేదీని ఖరారు చేస్తారు. అనంతరం అయ్యే ఖర్చును నిర్ణయించి కుటుంబానికి వాటాను(గోండిభాషలో సార) నిర్ణయిస్తారు. సేకరించిన డబ్బులతో మేకలు, కోళ్లను కొనుగోలు చేస్తారు. అనంతరం గ్రామ సమీపంలో గల అడవి దేవత(రాజుల్‌పేన్‌) వద్దకు మహిళలు మినహా అందరూ వెళ్తారు. వెళ్లేటప్పుడు కుటుంబం నుంచి బియ్యం లేదా మొక్కజొన్న, జొన్నపిండి తీసుకెళ్తారు. దానిని వారు ‘సే సా’ అని అంటారు. తీసుకొచ్చిన ఆహారపదార్థా లను ఒక్కదగ్గర చేర్చి వంట వండుతారు. వంటలు పూర్తయ్యక భోజనాన్ని ముద్దలుగా చేసి ప్రతి ఒక్కరికీ ఓ ముద్దను వేసి కూరలు వడ్డిస్తారు. ఇదే ఆదివాసులకు మహాప్రసాదం. 
రక్షణగీతయే పశువులకు శ్రీరామరక్ష..
సహపంక్తి భోజనం చేశాక దేవుని పేరిట రక్షణగీత గీస్తారు. అదే పశువులకు శ్రీరామరక్షగా నిలుస్తుందని వారి నమ్మకం. దేవుని ప్రాంగణం నుంచి అటవీ ప్రాంతం వరకు గీత గీస్తారు. ఆ గీతపై పశువులను దాటిస్తే  శుభం జరుగుతుందని నమ్మకం.
వాయిద్యాల నినాదం..
అకాడి పండుగ రోజు వాయించే వాయిద్యమే పశువులకు గుర్తింపు సూచిక. అడవిలోకి వెళ్లిన ప శువులు దారి మళ్లకుండా కాపరులు వాయించే ఆ శబ్ధాన్ని గుర్తించి మళ్లీ అక్కడికే చేరుకుంటాయ ని ఆదివాసుల విశ్వాసం. అప్పటి నుంచి నెల రో జుల పాటు పశువులను మేపే కాపరులు ఆ వాయిద్యాలను ఊదుతుంటారు. ఆ శబ్ధం విన్న పశువులు అడవుల్లో దారి మళ్లకుండా తిరిగి అదే స్థా నంలోకి  వస్తాయని వారి ప్రగాఢ విశ్వాసం.
కోడిపిల్లతో తెలిసే జాతకం..
పశువులు రక్షణగీత దాటేటప్పుడు ఎదురుగా ఓ కోడిపిల్లను వదిలేస్తారు. పశువుల పరుగుల మధ్య అది సురక్షితంగా బయటపడితే అంతా శుభమే జరుగుతుందని సంతోషిస్తారు. లేదా అది పశువుల ధాటికి చిక్కి నలిగిపోయి మృతి చెందితే ఏదో కీడు జరుగనుందని వారు భావిస్తారు. దీంతో  తిరిగి అ డవిదేవతకు శాంతిపూజలు చేస్తారు.
సర్వరక్షక.. ఏత్మసార్‌పేన్‌..
ఆదివాసులు సర్వరక్షకదేవతగా ఏత్మసార్‌పేన్‌ ను కొలుస్తారు. అకాడి పండుగ జరుపుకొని ఇం టికి తిరిగి రాగానే ఆ దేవత పూజలు జరుపుకోవ డం ఆనవాయితీ. ప్రజలతో పాటు పాడిపశువులు సురక్షితంగా ఉండాలని ఏత్మసార్‌పేన్‌ పూజలు జ రుకుంటారు. దినమంతా చేనులో పనులు చేసివచ్చాక ఆ దేవుని కొలుస్తూ డప్పుల చప్పుడుపై దండారీ, కోలాట నృత్యాలు చేస్తారు. ఇలా చేయ డంతో పనుల్లో అలసట చెందకుండా తగిన శక్తి సామర్థ్యాలు తిరిగి పెంపొందుతాయని వారి న మ్మకం. అంతే కాకుండా కుటుంబంలో అష్టఐశ్వర్యాలు లభిస్తాయని భావన. అత్యంత పవిత్రం గా భావించే ఈ పండుగ నాలుగు నెలలు కొనసాగించి, దీపావళితో ముగిస్తారు.                            


logo