శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 29, 2020 , 03:19:05

ఉపాధి కోర్సులను వినియోగించుకోవాలి

 ఉపాధి కోర్సులను వినియోగించుకోవాలిమందమర్రి రూరల్‌ : సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వృత్తి శిక్షణ కోర్సులను వినియోగించుకోవాలని మందమర్రి ఏరియా జీఎం రమేశ్‌రావు, సేవా అధ్యక్షురాలు శ్రీదేవి సూచించారు. సోమవారం స్థానిక సీఈఆర్‌ క్లబ్‌లో నిర్వహించిన వృత్తి శిక్షణ కోర్సుల ప్రారంభోత్సవానికి ఆయన సతీమణి ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు శ్రీదేవి తో కలిసి హాజరయ్యారు. ఏరియాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. టైలరింగ్‌, బ్యూటీషియన్స్‌, మగ్గం వర్క్‌, మోటార్‌ డ్రైవింగ్‌ వంటి వృత్తులపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం మొదటి బ్యాచ్‌లో 593 మందికి ఇప్పుడు 400 మందికి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. శిక్షణ కాలంలో మెళకువలు నేర్చుకుని స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కోర్సుల శిక్షణ కాల పరిమితిని మూడు నెలల నుంచి 6 నెలలకు  పెంచాలని ఫ్యాకల్టీ అడగడంతో వాటిని పరిశీలిస్తామని తెలిపారు. 

కొత్త కోర్సులకు అవకాశం కల్పిస్తాం

కొత్త కోర్సులు ఏవైనా ఉంటే సూచించాలనీ, వాటిని పరిశీలించి తప్పక అవకాశం కల్పిస్తామని చెప్పారు. గనులు, డిపార్టుమెంట్లపై కొన్ని వృత్తులు ఉన్నాయని వాటిని పొందేందుకు కొంత మంది సభ్యులు కలిసి ఒక్క సొసైటీగా వస్తే ఆ వృత్తులు  కాంట్రాక్టు పద్ధతిలో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందులో ముఖ్యంగా క్యాంటిన్స్‌ నిర్వహణ, పారిశుధ్యం వంటి పనులను క్యాంట్రాక్టు పద్ధతి ద్వారా పొందవచ్చన్నారు. బుదరగూడెనికిచెందిన 16 మంది యువకులకు కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధి కల్పించామని తెలిపారు. 

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా శిక్షణ తప్పనిసరి

కార్మిక కుటుంబాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యోగా వల్ల ఆర్యోగం సిద్ధిస్తుందని తెలిపారు. కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే సింగరేణి మైదానం సింగరేణి పాఠశాలలోని విద్యార్థులకు, రామకృష్ణాపూర్‌ ఠాగూర్‌ స్టేడియంలో యోగా కేంద్రం నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమగూడెం, మందమర్రి షిర్కె (ప్రాణహిత కాలనీ) యోగాను ప్రారంభిస్తామన్నారు. షిర్కేలో కొత్తగా యోగా హాలు నిర్మిస్తున్నామని తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఇదివరకు సింగరేణి షెడ్‌ను యోగా హాలుగా మార్చుతామని తెలిపారు. అనతంరం పలు యోగా శిక్షణ తరగతులను ఆయన సేవా అధ్యక్షురాలు శ్రీదేవి, పీఎం మురళీధర్‌రావు, కార్మిక సంఘ నాయకులు మేడిపల్లి సంపత్‌, సలేంద్ర సత్యనారాయణ, అధికారుల సంఘం అధ్యక్షుడు జక్క రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డీవైపీఎం రెడ్డిమల్ల తిరుపతి వ్యవహరించగా, సేవ సమితి సభ్యులు వివిధ కోర్సుల ఫ్యాకల్టీ, శిక్షణ తీసుకోనే సభ్యులు పాల్గొన్నారు. logo