ప్రపంచవ్యాప్తంగా నయా వాకింగ్ ట్రెండ్ నడుస్తున్నది. ‘6-6-6’ నడక పద్ధతి.. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నది. 6-6-6 నడక వ్యాయామం అనేది ఒక సులభమైన, సమర్థమైన ఫిట్నెస్ పద్ధతి. బరువు తగ్గడంతోపాటు గుండె ఆరోగ్యం, మానసిక స్థితిని మెరుగుపరచడానికి.. ఈ ఫిట్నెస్ ట్రెండ్ సాయపడుతుంది. బీపీ, రక్తంలో చక్కెర స్థాయులనూ నియంత్రిస్తుంది.
6 గంటలకు: రోజూ ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 6 గంటలకు వ్యాయామం చేయాలి. 60 నిమిషాలపాటు చురుకైన నడక కొనసాగించాలి.
6 నిమిషాల వార్మ్ అప్: నడక ప్రారంభించడానికి ముందు.. 6 నిమిషాల పాటు నెమ్మదిగా వార్మ్ అప్ చేయాలి. దీనివల్ల శరీరం వ్యాయామానికి సిద్ధమవుతుంది.
6 నిమిషాల కూల్ డౌన్: 60 నిమిషాల నడక తర్వాత.. మరో 6 నిమిషాలపాటు నెమ్మదిగా నడవాలి. దీంతో గుండె వేగం సాధారణ స్థితికి వస్తుంది.
6-6-6 పద్ధతిలో ఎక్కువ వేగంగా, చురుకుగా నడవాల్సి ఉంటుంది. కాబట్టి, తక్కువ సమయంలో, సులభంగా పూర్తవుతుంది. బిజీ షెడ్యూల్లోనూ వ్యాయామం చేయాలనుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక వారానికి 150 నిమిషాల వ్యాయామాన్ని పూర్తి చేయడానికీ ఇది దోహదం చేస్తుంది. ఉదయం 6 గంటలకు ఖాళీ కడుపుతో నడవడం వల్ల.. శరీరంలోని కొవ్వు కరిగి, బరువు తగ్గుతారు. సాయంత్రం 6 గంటలకు నడిస్తే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. 60 నిమిషాల చురుకైన నడకతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా తయారవ్వడంతోపాటు కండరాల శక్తి కూడా పెరుగుతుంది. ఇక వార్మ్ అప్తో గుండె వేగం, కండరాలకు రక్త ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుంది. నడుస్తున్నప్పుడు కండరాల నొప్పులు, బెణుకులు రాకుండా ఉంటుంది. కూల్ డౌన్ ప్రక్రియతో కండరాల నొప్పి తగ్గడంతోపాటు గుండె వేగం కూడా క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుంది.