సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మొన్న నగల దుకాణంలోకి చొరబడి కాల్పులు జరిపి దోపిడీ.. నిన్న ఇంట్లోకి చొరబడి మహిళను దారుణంగా హత్యచేసి దోపిడీ.. తాజాగా శంకర్‌పల్లిలో స్టీల్ వ్యాపారులను వెంబడించి, దారి దోపిడీ. ఈ వరుస ఘటనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇండ్లలో భద్రత లేక, బయట భద్రత లేక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా రాజేంద్రనగర్, బాలానగర్ జోన్ల పరిధిలో దోపిడీ దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, దారిదోపిడీలు, హత్యలు వంటి నేరాలు పెరిగిపోతున్నాయి.
నిఘా లోపమో లేక విస్తరిస్తున్న నేర సామ్రాజ్యమో తెలియదు కాని కారణాలేమైనప్పటికీ ప్రజలకు ఇంటా, బయటా భద్రత కరువవుతోందనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బాలానగర్ జోన్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 18న జరిగిన సహస్త్ర హత్య, ఈనెల 10న కూకట్పల్లి ఠాణా పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే రేణు అగర్వాల్‌ను ఆమె ఇంట్లో పనిచేసే వ్యక్తులే దారుణంగా హత్యచేసి, ఇంట్లో ఉన్న నగలు, నగదును దోచుకెళ్లిన విషయం తెలిసిందే.
తాజాగా దుండగులు దారిదోపిడీకి పాల్పడి..పోలీసులకు మరో సవాల్ విసిరారు. నగరానికి చెందిన రాకేశ్ అగర్వాల్ వికారాబాద్‌లోని కస్టమర్ నుంచి రావల్సి ఉన్న రూ.40 లక్షలను తీసుకురావాల్సిందిగా తన వద్ద పనిచేస్తున్న సాయిబాబా, మణి అనే ఇద్దరు వ్యక్తులను శుక్రవారం కారులో వికారాబాద్‌కు పంపాడు. యజమాని సూచన మేరకు వికారాబాద్‌కు వెళ్లిన సాయిబాబా, మణి అక్కడి కస్టమర్ నుంచి రూ.40లక్షలు తీసుకుని మధ్యాహ్నం 12.30నుంచి ఒంటిగంట సమయంలో నగరానికి తిరిగి వస్తుండగా, శంకర్ పల్లి మండలం, హుస్సేన్‌పూర్ ప్రాంతంలో నిర్మానుష ప్రదేశానికి చేరుకోగానే నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు షిఫ్ట్ డిజైర్ కారులో వచ్చి స్టీల్ వ్యాపారుల కారును అడ్డగించారు.
కారు డ్రైవ్ చేస్తున్న మణి కండ్లలో కారం చల్లి దాడిచేయడమే కాకుండా, కారు అద్దాలు పగులగొట్టి, వెనక సీట్లో కూర్చున్న సాయిబాబాపై రాయితో దాడిచేసి, అతడి వద్ద నుంచి రూ. 40 లక్షల నగదు ఉన్న బ్యాగును లాక్కుని కారులో పరారయ్యారు. పారిపోతున్న క్రమంలో కొత్తపల్లి గ్రామ శివారులో వారి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. దుండగులు కారును అక్కడే వదిలి, డబ్బు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిలో లభించిన ఆధారాలతో నిందితులను గుర్తించినట్లు తెలిసింది.