మధిర, జూలై 27 : ప్రస్తుత సీజన్లో వస్తున్న జ్వరాలను నిర్లక్ష్యం చేయొద్దని, వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు సూచించారు. మధిరలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం తనిఖీ చేసిన ఆయన వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్లు, స్టాక్ రూమ్‌లో మందులను పరిశీలించారు. రోగులకు సకాలంలో వ్యాక్సిన్లు, టీకాలు వేస్తున్నారా.. అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీజనల్ జ్వరాలు సోకుతున్న ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పార్టీ మండల, పట్టణ కార్యదర్శులు బొగ్గుల భాస్కర్‌రెడ్డి, అరిగె శ్రీనివాసరావు, కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్, నాయకులు బొగ్గుల వీరారెడ్డి, బోయపాటి వెంకటేశ్వర్లు, నాగబాబు తదితరులు ఉన్నారు.