భద్రాద్రి కొత్తగూడెం, మే 16 ( నమస్తే తెలంగాణ) : నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ కంచర్ల అధ్యక్షతన స్థాయీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు వంద ఎకరాల భూమి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
ఇంటి నంబర్ లేని గృహాలకు యూజర్ చార్జీలు వసూలు చేసి ఇంటి నంబర్, విద్యుత్ మీటర్ పొందే విధంగా చూడాలని డీపీవోను కోరారు. వచ్చే వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు శానిటేషన్ పనుల కోసం ప్రణాళిక రూపొందించాలన్నారు. పౌష్ఠికాహార పథకం కింద ఆరు నెలల నుంచి మూడేళ్ల వయస్సు ఉన్న పిల్లలు లబ్ధి పొందుతున్నారని, వీరికి బాలామృతంతోపాటు నెలలో 16 రోజులు గుడ్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో ప్రసూనరాణి, జెడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.