ఖమ్మం, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాల విభజన తరువాత ఏర్పడిన జడ్పీ పాలకవర్గానికి తొలి చైర్మన్ బాధ్యతలు చేపట్టి ప్రజలకు ఎంతో సేవ చేశానని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. ఈ నెల 6వ తేదీతో జడ్పీ పాలకవర్గం ముగియనున్న నేపధ్యంలో తన చాంబర్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో తన హయాంలో చేసిన అభివృద్ధిని వివరించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకంలో, మంత్రిగా పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో జిల్లా అభివృద్ధికి విశేష కృషిచేశానన్నారు. ప్రజాప్రతినిధుల పూర్తి సహకారం లభించిందన్నారు. జిల్లా పరిషత్‌లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఐదేళ్ల కాలంలో జడ్పీ సాధారణ నిధులతో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు, ఉద్యోగోన్నతులు చేపట్టామని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వాసుపత్రి చైర్మన్‌గా నిరంతరం సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించినట్లు తెలిపారు. ఈ ఐదేళ్లు సహకారం అందించిన కేసీఆర్‌కు, అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.