కారేపల్లి,జూన్ 25 : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి మండలానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాకు చెందిన వాంకుడోత్ కుమార్(22), అతని స్నేహితుడు భూక్య కుమార్ తో కలిసి పనిమీద మోటార్ సైకిల్ పై ఖమ్మం వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు.
ఖమ్మం- ఇల్లందు ప్రధాన రహదారి మర్రిగూడెం సమీపంలో వారు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ని గుర్తు తెలియని భారీ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాంకుడోత్ కుమార్ శరీర భాగాలు నుజ్జునుజ్జు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పంగా గాయపడిన భూక్య కుమార్ను స్థానికుల సహాయంతో అంబులెన్స్ ద్వారా దవాఖానకు తరలించారు. మృతుడు వాంకుడోత్ కుమార్ తండ్రి రవి ఫిర్యాదు మేరకు కామేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.