జూలూరుపాడు, డిసెంబర్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించాడు. కొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అన్నదమ్ములైన అక్కుల రాములు, అక్కుల నరసింహారావు బరిలో నిలిచారు. అక్కుల రాములు సిపిఐ మద్దతుగా బరిలో నిలవగా, అక్కుల నరసింహారావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అన్నదమ్ములు పోటీలో ఉండటంతో మండలంలో వారి గెలుపు ఆసక్తిగా మారింది. ఎన్నికల ఫలితాల్లో అన్నపై తమ్ముడు నరసింహారావు 26 ఓట్లతో విజయం సాధించాడు. గ్రామంలో 893 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 751 ఓట్లు పోలయ్యాయి. రక్త సంబంధీకులైన అన్నదమ్ముల మధ్య పోటీ రసవత్తరంగా మారి అన్నపై తమ్ముడు విజయం సాధించడంతో మండలంలో వీరి గెలుపు చర్చనీయాంశంగా మారింది.