కారేపల్లి, మే 30 : గుండెపోటుతో యువ రైతు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మంగళితండాలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళితండాకు చెందిన పిల్లలమర్రి వెంకటేశ్ (35) శుక్రవారం ఉదయం గ్రామస్తులతో వ్యవసాయంపై చర్చించాడు. ఆ సమయంలో ఛాతిలో నొప్పి రావడం, కడుపులో గ్యాస్ వల్ల ఇలా వస్తుందనుకుని వెంకటేశ్ ఇంటికి వెళ్లి పడుకున్నాడు.
పడుకున్న వెంకటేశ్ ఎంతకి లేవకపోవడంతో భార్య ఉమ తట్టి లేపే ప్రయత్నం చేసింది. వెంకటేశ్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులకు తెలిపి ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే మృతి చెందడంతో ఫలితం లేకుండా పోయింది. వెంకటేశ్‌కు భార్య ఉమా, ఇద్దరు కుమార్తెలు కీర్తన, అనదిత, ఓ కుమారుడు నిశాంత్ ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆదర్శరైతుగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.