– పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
కారేపల్లి, జనవరి 31 : తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫోన్ టాపింగ్ పేరుతో దుర్మార్గపు రేవంత్ రెడ్డి నాయత్వoలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక చర్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ పిలుపు మేరకు ఆదివారం నాడు మండల, నియోజకవర్గ, జిల్లా, పట్టణ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, మోటార్ బైక్ ర్యాలీలు, దిష్టిబొమ్మల దగ్ధం లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించి పార్టీ పిలుపుని అనుసరించి పై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీ నుండి 10వ వార్డు సభ్యురాలుగా ఎన్నికైన సిద్ధంశెట్టి హారికను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ముత్యాల వెంకట అప్పారావు, స్థానిక నాయకులు సిద్ధంశెట్టి నాగయ్య, షేక్ ఖాజావలి, షేక్ పాషా, షేక్ సైజన్, కృష్ణ పాల్గొన్నారు.