కారేపల్లి, ఏప్రిల్ 19 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని ఇల్లెందు నుండి వయా కారేపల్లి, కమలాపురం మీదుగా ఖమ్మం వరకు ఆర్టీసీ బస్ సర్వీస్‌ను శనివారం స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు. ముందుగా మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పచ్చజెండాను ఊపి బస్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఉసిరికాయలపల్లి నుండి సూర్యతండా వరకు స్థానిక అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే బస్‌లో ప్రయాణించారు. అదేవిధంగా సూర్యతండా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.