భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఆ రైతుది చండ్రుగొండ మండలం తిప్పనపల్లి. అతడికి ఉన్నది మూడెకరాల పంట చేను. పత్తి పంట వేశాడు. కాలం కలిసిరాలేదు. పత్తి దిగుబడి రాలేదు. సర్కారు పంటను కొనలేదు. తేమ శాతం పేరుతో ప్రభుత్వం కొర్రీలు పెట్టేసరికి చివరికి బయట వ్యాపారులకు అమ్ముకున్నాడు. అప్పటికే రూ.లక్ష నష్టం వచ్చింది. రెండుసార్లు వానలు పడ్డాయి. పత్తికాయలు కాపునకు రాలేదు. చేసేదేమీ లేకపోయింది. వచ్చిన కొద్దిపాటి పంటనే నష్టానికే అమ్ముకున్నాడు. అయితే, ఈ పత్తి పంట సాగు కోసం బయట అప్పులు తెచ్చాడు. కనీసం రైతుభరోసానైనా సకాలంలో అందితే అప్పులు తీరుద్దామనుకున్నాడు. కానీ, నిరాశే ఎదురైంది. నిరుటి వానకాలం రైతుభరోసాను చాలా ఆలస్యంగా ఇచ్చారు.
యాసంగి భరోసానూ అలాగే చేశారు. సీజన్ ముగిశాక ఇవ్వడం మొదలు పెట్టారు. అదికూడా ఒక్కో ఎకరం చొప్పునే ఇస్తామని చెప్పారు. మొదటి దఫాలో ఒక్క ఎకరానికి, రెండో దఫాలో మరో ఎకరానికి ఇచ్చారు. ఇంకా మరో ఎకరానికి రావాల్సి ఉంది. ఇంకా రాలేదు. ఈలోపు ఈ ఏడాది వానకాలం సీజన్ కూడా మొదలైంది. మళ్లీ పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. గత యాసంగిలో పెండింగ్‌లో ఉన్న ఎకరంతోపాటు ఈ వానకాలం రైతుభరోసాను ఇప్పటికైనా సకాలంలో జమ చేస్తారేమోనన్న ఆశతో రోజూ ఎదురుచూస్తున్నాడు. ఫోన్‌కు ఎప్పుడు మెసేజ్ వస్తుందా? అని కళ్లుకాయలు కాసేలా చూస్తున్నాడు. ఈ పరిస్థితి ఈ రైతు ఒక్కడిదే కాదు.. భద్రాద్రి జిల్లాలోని 1,81,008 మంది రైతులది.
‘రైతుబంధు పేరుతో కేసీఆర్ ఒక్కో ఎకరానికి రూ.10 వేల పంటల పెట్టుబడి సాయమే ఇస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే రూ.15 వేలు ఇస్తాం’ అంటూ అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏకంగా పంటల పెట్టుబడి సాయానికే ఎగనామం పెడుతోంది. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక రూ.12 వేలే ఇస్తామంటూ మాట తప్పింది. అయితే, ఆ రూ.12 వేలను కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. అధికారం చేపట్టిన ఈ రెండున్నరేళ్లలో ఏ ఒక్క సీజన్‌కూ సక్రమంగా పెట్టుబడి సాయాన్ని అందించలేదు.
ఏకంగా అనేక సీజన్లకు ఎగనామం కూడా పెట్టింది. గత యాసంగిలో ఓ విచిత్ర పద్ధతిని కూడా అమలు చేసింది. ఎన్ని ఎకరాలున్న రైతుకైనా అందరితో కలిపి మొదట ఒక ఎకరానికి ఒక సీజన్‌కు రూ.6 వేల చొప్పున జమ చేస్తామని చెప్పింది. అన్నట్లుగానే సీజన్ ముగిశాక ఓ రూ.6 వేలను జమ చేసింది. మరికొన్ని రోజుల తరువాత అన్నదాతలను అష్టకష్టాలు పెట్టి మరో రూ.6 వేలను జమ చేసింది. ఇక ఆ తరువాత మిగతా రైతులకు తదుపరి విడతల్లో జమ చేయడం నిలిపివేసింది. ఈ లోపు గత యాసంగి సీజన్ పోయింది. ఇప్పుడు వానకాలం సీజన్ కూడా ప్రారంభమైంది. దీంతో రైతు భరోసా అందక మిగిలిన రైతులు గగ్గోలు పెడుతున్నారు.
రైతు భరోసా జమ చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారీ మాట తప్పుతోంది. అయితే, రైతులు మాత్రం తమ ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయా? అని రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. ఓపిక నశించిన సమయంలో వ్యవసాయ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే, ప్రభుత్వం సరైన సమయానికి రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులకు సమాధానం చెప్పేందుకు అధికారులు కూడా జంకుతున్నారు. ఒక్కోసారి దాటవేస్తున్నారు. మరీ తప్పదనుకుంటే.. ‘రైతు భరోసా తప్పకుండా జమ అవుతుంది’ అంటూ సమాధానం చెప్పి పంపిస్తున్నారు. కానీ, రోజులు గడిచినా వారు చెప్పినట్లుగా రైతుభరోసా మాత్రం జమ కావడం లేదు. దీంతో రైతులందరూ నిరాశ చెందుతున్నారు.
2024-25లో వానకాలం రైతు భరోసా అసలు ఇవ్వనేలేదు. యాసంగిలో 1,75,772 మంది రైతులకు రూ.295 కోట్లు చెల్లింపులు చేశారు. 2025-26లో వానకాలం సీజన్లో 1,78,470 మంది రైతులకు రూ.332 కోట్లు రావాల్సి ఉండగా రూ.318 కోట్లు మాత్రమే చెల్లించారు. యాసంగి సీజన్లో 1,80,008 మంది రైతులకు ఇప్పటి వరకు రూ.178 కోట్లు చెల్లించారు. మొత్తం రూ.337 కోట్లు చెల్లించాలి. అప్పుడు వానకాలం, ఇప్పుడు యాసంగిలో రైతులకు పంగనామాలు పెట్టింది.
ప్రభుత్వం రైతుభరోసా ఇచ్చినా, ఇవ్వకున్నా రైతులు మాత్రం తమ విద్యుక్త ధర్మాన్ని వీడడం లేదు. అప్పులు తెచ్చుకొనైనా సరే పంటలు సాగుచేసుకుంటున్నారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు తమ విధి నిర్వహణలో తాము నిమగ్నమవుతున్నారు. రైతులు ఎన్నెన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారో తెలుసుకొని అందుకు అనుగుణమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గత వానకాలంలో 6,09,622 ఎకరాల్లో పంటలను సాగు చేయగా ఈ ఏడాది వానకాలంలో 6,37,800 ఎకరాల్లో పంటలను వేయడానికి రైతులు సిద్ధమయ్యారు. ఇందులో వరి 1.75 లక్షల ఎకరాలు, పత్తి 2.10 లక్షల ఎకరాలు, ఆయిల్‌పాం 90 వేల ఎకరాలు, జొన్న 80 ఎకరాల్లో వేయనున్నారు. అయితే, అధికారులు మాత్రం తక్కువ రోజుల్లో పండే రకాలను సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నారు.
రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఆ తరువాత రూ.12 వేలే ఇవ్వగలమని చెప్పారు. ఇప్పుడసలు అవి కూడా ఇవ్వడం లేదు. అసలు ఎవరు పెంచమన్నారు? ఇప్పుడెందుకు ఇవ్వడం లేదు? కనీసం ఎప్పుడిస్తారో సమాధానం కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. అసలు ఇస్తారో ఇవ్వరో చెప్పాలి. గత కేసీఆర్ ప్రభుత్వంలో సీజన్‌కు ముందే ఖాతాలో నిధులు జమ అయ్యేవి.
-అంగోత్ లక్పతి, వెంకట్యాతండా, టేకులపల్లి
గత యాసంగి సీజన్ రైతు భరోసా నిధులను రెండు ఎకరాల వరకు మాత్రమే ఇచ్చారు. మిగతావి ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. అసలు ఇస్తారో లేదో తెలియడం లేదు. అధికారులను అడిగితే వారికి తెలియదంటున్నారు. మరి ఎవరిని అడగాలి. ఇప్పటికే ఎరువుల కోసం క్యూలో ఉంటున్నాం. మక్కలు వేస్తే కొనడం లేదు. వాన వస్తే తడిసిపోయాయంటున్నారు. రైతులకు మీరు ఏం చేసినట్లు?
ఇప్పటి వరకు ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఈ నెల చివరి కల్లా భరోసా వేస్తారు. ఇప్పటి వరకు ప్రతీ రైతుకు రెండు ఎకరాల వరకూ రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. ఇప్పుడు వానకాలం సీజన్ మొదలైంది. పంటల సాగు ప్రణాళిక తయారు చేశాం. ఎరువులు కూడా పుష్కలంగా ఉన్నాయి. వాతావరణ పరిస్థితులను బట్టి తక్కువ రోజుల్లో పంటలు చేతికొచ్చే సీడ్‌ను సాగు చేయాలని చెబుతున్నాం.
-వేల్పుల బాబూరావు, డీఏఈవో, భద్రాద్రి