అశ్వారావుపేట రూరల్/అశ్వారావుపేట టౌన్ మార్చి 11 : అటవీ శాఖకు చెందిన టేకు ప్లాంటేషన్‌లో అధికారులు బోర్వెల్ వేస్తుండగా గిరిజనులు అడ్డుకొని రాస్తారోకో చేశారు. ఈ ఘటన అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలోని అటవీ శాఖకు చెందిన టేకు ప్లాంటేషన్‌లో జంతువుల తాగునీటి కోసం అటవీ శాఖ అధికారులు బోర్ వేస్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న గ్రామస్తులు, గిరిజన సంఘం నాయకుడు నాగేశ్వరరావు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపుతూ ఈ సర్వే నెంబర్‌పై హైకోర్టు నుంచి స్టేటస్ కో తీసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా అటవీ శాఖ అధికారులు పనులు చేపట్టడం సరికాదని ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు ఎస్సై రామ్మూర్తి, రేంజర్ మురళికి వివరించారు.
గిరిజనులు చెప్పిన విధంగా 36, 37 సర్వే నెంబర్లు కావని, ఆ సర్వే నెంబర్లు లంకాలపల్లి సరిహద్దుల్లో ఉన్నాయని చెప్పగా.. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అదనపు ఎస్సై కలుగజేసుకుని సమస్యను శాంతియుతంగా తహసీల్దార్ సమక్షంలో పరిష్కరించుకోవాలని నచ్చజెప్పారు. అనంతరం గిరిజనులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ వనం కృష్ణప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. జాయింట్ సర్వే నిర్వహించి రామన్నగూడెం గిరిజనులకు భూములు అధికారికంగా అప్పగించాలని కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గిరిజనులు, అటవీ శాఖకు మధ్య వివాదంగా ఉన్న రామన్నగూడెం భూములపై స్టేటస్ కో ఉన్నది నిజమేనని, బోర్వెల్ వేస్తున్న భూములు ఏ సర్వే నెంబర్లో ఉన్నవనే దానిపై ఆర్ఐ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనులు మాత్రం ఆ భూమి అటవీ శాఖదా? తమదా?తేల్చాలని పట్టుబట్టారు. తిరిగి ప్లాంటేషన్‌కు చేరుకుని బోర్వెల్ పనులకు అడ్డుగా నిలిచారు. సాయంత్రం వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.