మధిర, జులై 11 : అర్హురాలైన తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని పేర్కొంటూ ఓ ఒంటరి మహిళ ఖమ్మం జిల్లా మధిర తాసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన దీక్ష చేపట్టింది. మండలంలోని దెందుకూరు గ్రామం, దళిత కుటుంబానికి చెందిన ఎలిజాల శిరోమణి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని మధిర తాసిల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి దీక్షకు కూర్చుంది. అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అవకతవకులు పాల్పడుతూ తమకు ఇల్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ గ్రామంలో రెండంతస్తుల బిల్డింగ్ ఉన్న వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినట్లు తెలిపింది.
అంతేకాకుండా 10 నుండి 20 ఎకరాల భూమి ఉన్న రైతులకు కూడా ఇల్లు మంజూరు అయ్యాయని, కొత్త రేషన్ కార్డు రాని వారికి, ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురికి కూడా ఇల్లు మంజూరు అయినట్లు తెలిపింది. పొలాలు పక్కా ఇల్లు ఉన్న వారే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులా అని ఆమె ప్రశ్నించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతి గ్రామంలో ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, ఇల్లు లేని పేదలకు మొదటి ప్రాధాన్యతగా ఇల్లు ఇస్తామంటే నిజమేనని నమ్మామని, కానీ తమ గ్రామంలో అలా జరగట్లేదని వాపోయింది. నీడ లేని తమ కుటుంబానికి దయచేసి ఇల్లు ఇప్పించాలని కోరింది.