భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): చేపల పెంపకంతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, సిరులు కురిపించే కొర్రమీను పెంపకంతో లాభాలు గడించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులు, వ్యవసాయ శాఖ ఏపీఎంలకు కొర్రమీను చేపల పెంపకంపై కొత్తగూడెం క్లబ్లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయానికి ప్రకృతి సహకరిస్తేనే అధిక దిగుబడులు పొందవచ్చని, కానీ.. చేపల పెంపకంపై మహిళలు దృష్టి సారిస్తే మరిన్ని లాభాలు పొందవచ్చన్నారు. మార్కెట్లో కొర్రమీనుకు ఎక్కువగా డిమాండ్ ఉందని, వీటికి బురదలోనూ ఎక్కువ కాలం బతికే తత్వం ఉంటుందన్నారు. కొర్రమీను చేపల పెంపకం కోసం ఎక్కువ ప్రదేశం కూడా అవసరం లేదని, పావుగుంట ప్రదేశంలో వాటర్ ట్యాంకు, ఫాంపాండ్ నిర్మాణం, చేపల పెంపకానికి అవసరమైన దాణా వంటివి తయారు చేసుకోవచ్చన్నారు.
ఒక్కో చేప పిల్ల ఖరీదు రూ.15 కాగా.. వెయ్యి చేపపిల్లల పెంపకం చేపడితే.. అందులో 100 చేప పిల్లలు చనిపోయినా.. 900 చేప పిల్లలు చేతికొస్తాయని తెలిపారు. మార్కెట్లో కిలోకు రూ.300 చొప్పున అమ్మినా.. రూ.2.70 లక్షలు కేవలం ఏడు నెలల్లోనే రాబట్టుకోవచ్చన్నారు. అనంతరం జిల్లాలో ప్రయోగాత్మకంగా అశ్వాపురం, సుజాతనగర్లో కొర్రమీను చేపల పెంపకంలో విజయం సాధించిన రైతులు దుర్గాప్రసాద్, జంపన్నలు వారి అనుభవాలను పంచుకున్నారు. సదస్సులో అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఏవో బాబురావు, ఎల్డీఎం రాంరెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ తిరుపతయ్య, మత్స్యశాఖ ఏడీ ఇంతియాజ్ ఖాన్, ఆక్వా కనెట్స్ సంస్థ ప్రతినిధులు, మహిళా సమాఖ్య సభ్యులు, ఏపీఎంలు పాల్గొన్నారు.