మధిర, డిసెంబర్ 27 : మధిర మండలం చిలుకూరు గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు శనివారం కదం తొక్కారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ ఎస్ఐ సి.జనార్ధన్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం బాటిళ్లపై స్టిక్కర్లు లేకుండా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి మద్యాన్ని తీసుకువచ్చి గ్రామంలో విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ మందు వల్ల గ్రామంలో ప్రతిరోజు అల్లర్లు జరుగుతున్నాయని, గృహహింస పెరిగిపోతోందని వాపోయారు. గతంలో పలుమార్లు పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే, ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు.
అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు. మహిళల ఆందోళనకు సీపీఎం మండల కార్యదర్శి మంద సైదులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సవరం వెంకటేశ్వర్లు, నిడమానూరి సంగమేశ్వరరావు, లగడపాటి వెంకయ్య, వీరబాబు, కృష్ణ, శేషగిరి, సత్యం, చాట్ల రమేశ్, దాసు, జానపాటి తిరుపతిరావు, మహిళా నేతలు మల్ల వెంకట్ రావమ్మ, రేగమూడి రాణి, నిడమానూరి రాజ్యలక్ష్మి, రాజేశ్వరి, రాయల లలితమ్మ, పిక్కిలి వెంకట్ రావమ్మ, కృష్ణ శిరీష పాల్గొన్నారు.