చండ్రుగొండ, అక్టోబర్ 21: ‘పండుగ వెళ్లిపోయిన పదిరోజులకు చీరలా?’ అవి కూడా మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు, గిరిజన మహిళలకేనా? మేమంతా తెలంగాణ ఆడబ్డిడలం కాదా?’ అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మా మండలానికి 12 వేల చీరలను పంపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 6,098 చీరలే పంపిస్తుందా?’ అంటూ ప్రశ్నించారు.
‘తెలంగాణ ఆడపడుచులకు చీరల పంపిణీ’ పేరిట ముద్రించిన కవర్లో పెట్టిన చీరలను తీసుకొచ్చిన ప్రభుత్వం.. వాటిల్లో ఎక్కడా బతుకమ్మ పేరును ప్రస్తావించలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చండ్రుగొండ మండలం రావికంపాడు, తిప్పనపల్లి పంచాయతీల కార్యాలయాల్లో ఆయా పంచాయతీల కార్యదర్శులు సోమవారం ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడ కేవలం ఎస్‌హెచ్‌జీ సభ్యులకే పంపిణీ చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న కొందరు గ్రామ మహిళలు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ‘కేవలం ఎస్‌హెచ్‌జీల సభ్యులకే పంపిణీ చేయడమేంటి?’ అంటూ రావికంపాడు పంచాయతీ సెక్రటరీపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో అక్కడ చీరల పంపిణీని కొద్దిసేపు నిలిపివేశారు. నిరసనకారులను పంపించివేశాక తిరిగి చీరల పంపిణీని కొనసాగించారు. ఇక తిప్పనపల్లిలో కూడా మహిళలు ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గుట్టుచప్పుడు కాకుండా చీరల పంపిణీ చేయడం ఏమిటి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారికి పంచాయతీ సెక్రటరీ శివ సర్ది చెప్పి పంపించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు ముందే మహిళలందరికీ చీరలు వచ్చేవని, ఆ చీరలు కట్టుకొని తాము బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకునే వాళ్లమని గుర్తుచేశారు.