కొత్తగూడెం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 15: సర్కారు పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టే కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులకు నెలనెలా వేతనాలు వస్తేనే సరిపోయేది అంతంతమాత్రం. కానీ.. మూడునెలల నుంచి బిల్లులు రాకపోవడంతో వంట కోసం మళ్లీ అప్పు చేస్తున్నారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనుంచి విద్యార్థులకు గుడ్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.
ఒక్క గుడ్డుకు ప్రభుత్వం ఇచ్చేది రూ.5 అయితే.. బయట రూ.7.50 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆడబిడ్డలపై కొత్త సర్కారు చూపించే ప్రేమ ఇదేనా?’ అంటూ వారు వాపోతున్నారు. కాగా, ప్రస్తుతం మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు రూ.కోటికి పైగా పెండింగ్లో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం ఇస్తామన్న హామీని కాంగ్రెస్ అటకెక్కించిందని, అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు కూడా పరిష్కరించడం లేదని పలువురు వంట కార్మికులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలోని 2,150 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతోంది. అంతేగాక గత కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల కోసం సీఎం బ్రేక్పాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టి సమర్థవంతంగా నిర్వహించగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని విస్మరించింది. తాము అప్పు చేసి మధ్యాహ్న భోజనం వండిపెట్టినప్పటికీ వంటలకయ్యే సరుకులకు బిల్లులు కూడా ఇవ్వకపోవడం ఏమిటని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
పాత కొత్తగూడెం హైస్కూల్లో వంట చేస్తున్న ఈమె పేరు ఆవాల శ్రావణి. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వేతనంతోపాటు బిల్లులు కూడా సకాలంలో వచ్చేవి. దీంతో జీవనం సాఫీగా సాగిపోయింది. కానీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనాలు, బిల్లులు సక్రమంగా రావడం లేదు. వంట కోసం తెచ్చిన అప్పు పెరిగిపోయింది.
దీంతో గత్యంతరం లేక మెడలోని బంగారు పుస్తెల తాడును తాకట్టు పెట్టి అప్పు తీర్చింది. పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టే తమ కష్టాన్ని గుర్తించని కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తోంది. వేతనాలు, బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది శ్రావణి ఒక్కరి సమస్య కాదు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 2,150 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్న 1,107 మంది కార్మికులది.
పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. బయటి మార్కెట్లో ఒక్క కోడిగుడ్డు ధర రూ.7.50 ఉంటే.. ప్రభుత్వం కేవలం రూ.5 మాత్రమే చెల్లిస్తోంది. దీంతో మాపై అదనపు భారం పడుతున్నది. మేము కొనుగోలు చేసిన వాటికి బిల్లులు ఇవ్వకపోగా.. అదనపు ధరలు కూడా భరించాల్సి వస్తోంది. ఇక నుంచి భోజనంలో గుడ్లు అందించవద్దని అనుకుంటున్నాం. వేతనాలు లేకుండా ఎన్ని రోజులు పని చేయాలి?
పాఠశాలల్లో వంట షెడ్లు లేవు. గ్యాస్ పొయ్యిలు రావు. వేతనాలు, బిల్లులు కూడా సకాలంలో అందకపోవడంతో సతమతమవుతున్నాం. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నెలల తరబడి పెండింగ్లో బిల్లులు ఉంటే కిరాణా షాపు యజమానులు రోజూ డబ్బులు పెడుతున్నారు. కిరాణా దుకాణాల వద్ద అధికారులు అప్పు ఇప్పిస్తే వండి పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
– గుంజి రమాదేవి, వంట కార్మికురాలు, కొత్తగూడెం
మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు రావాల్సిన మాట వాస్తవమే. మూడునెలల బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీనిపై వర్కర్లు వినతిపత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాగానే బిల్లులు చెల్లిస్తాం. ఇప్పటికే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.
– వెంకటేశ్వరాచారి, డీఈవో, భద్రాద్రి కొత్తగూడెం