ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ (Khammam) మండలం ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలకు హై టెన్షన్ కరెంటు తీగలు శాపంగా మారుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య నుంచి తమను విముక్తి కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతున్నది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మండలంలో హై టెన్షన్ కరెంటు వైర్ల సమస్యను తీరుస్తామని హామీ సైతం ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడి లాగానే మిగిలిపోతుంది. ఏడాది క్రితం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి గణేష్ నగర్లో ఓ బాలుడు హై టెన్షన్ వైర్లకు బలై ప్రాణాలు విడిచాడు.
ఆ సంఘటన మరువక ముందే తాళ్లేసి తండా చిన్నతండ తండాలో సైతం పలు విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా సోమవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలం కసన తండాలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని మారుతీ ముత్తమ్మ అనే మహిళ ఇంటి గోడ పై బట్టలు ఆరవేసే క్రమంలో హై టెన్షన్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో తండావాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటెన్షన్ వైర్ల సమస్యను స్థానిక అధికారులు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం కనిపించలేదని వాపోయారు. ఉత్తమ మరణంతో కాసనా తండ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.