కారేపల్లి, జూన్ 06 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కారు – ఆటో ట్రాలీ ఢీకొన్న దుర్ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన అద్దంకి సాయి, మేకల సీతమ్మ, మంగమ్మ ఆటో ట్రాలీలో ఇల్లెందు నుండి కారేపల్లి వైపు వస్తున్నారు. ఉసిరికాయలపల్లి నుండి భాగ్యనగర్ తండాకు చెందిన కారు కోటమైసమ్మ ఆర్చ్ వద్ద రోడ్డు ఎక్కే క్రమంలో ఆటో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేకల సీతమ్మ(40) అక్కడికక్కడే మృతి చెందగా అద్దంకి సాయి, మంగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కారేపల్లి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ గోపి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.