ఖమ్మం రూరల్, నవంబర్ 03 : ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఓ మహిళ హత్యకు గురైంది. ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గునిగంటి నాగమణి (45) తన కుమారుడు మహేశ్‌కు తన అన్న మోటపోతుల వెంకన్న కూతురు అఖిలను ఇచ్చి మూడేండ్ల క్రితం వివాహం చేసింది. ఏడాది కాలంగా మహేశ్, అఖిల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. గ్రామ పెద్ద మనుషులు ఇరువురికి నచ్చజెప్పి అఖిలను కాపురానికి పంపడం జరిగింది. కాగా కొద్దీ రోజులకే జ్వరం తదితర సమస్యలతో అఖిల అదే గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. సోమవారం మరోమారు వెంకన్న తన కూతురు అఖిలతో పాటు కొడుకు మనోజ్, తన బావమరిది, డోర్నకల్ మండలం దేవుడి సంకీస గ్రామానికి చెందిన హెల్ది వెంకన్నను వెంటపెట్టుకుని తెల్లవారుజామున నాగమణి ఇంటికి వెళ్లాడు. అయితే అఖిల తనకు ఇష్టం లేదని, ఆమె ఇంటికి రావద్దని మహేశ్ తెగేసి చెప్పడంతో వారు వెనుతిరిగి వెళ్లారు.
కొద్దిసేపటికి వెంకన్న కుమారుడు మనోజ్ బావమరిది హెల్ది వెంకన్న బైక్‌పై నాగమణి ఇంటికి వచ్చి నిమిషాల వ్యవధిలోని తన వెంట తెచ్చుకున్న కత్తితో వెంకన్న పొడవడంతో నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. తన తల్లిపై దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న మహేశ్ ఇంటి నుంచి బయటకు రావడంతో మనోజ్, వెంకన్నఅతడిపై సైతం తీవ్రంగా దాడి చేసి అక్కడినుండి పారిపోయారు. విషయం తెలిసిన రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, ఖమ్మం రూరల్ సీఐ పుష్కరాలు సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు నాగమణితో పాటు తీవ్ర గాయాలైన మహేశ్‌ను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Khammam Rural : ముత్తగూడెంలో మహిళ దారుణ హత్య