ఖమ్మం, సెప్టెంబర్ 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎందరో అమర వీరుల త్యాగ ఫలితమే తెలంగాణ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది అమరులైన తరువాత నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం ప్రకటించింది. కానీ నిజాం పాలకుల చేతిలో ఉన్న నాటి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కాలేదని గుర్తుచేశారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జరిగిన వేడుకలలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
ఈ ప్రాంతంలోని పాలకులకు వ్యతిరేకంగా భారత దేశంలో ఈ ప్రాంతాన్ని విలీనం చేయాలని ఎంతో మంది నాయకులు తెలంగాణ ప్రాంతానికి ప్రజా స్వామిక స్వేచ్ఛను కోరుకుని ఉద్యమించడంతో 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారత దేశంలో విలీనం చేసి ప్రజలకు విముక్తి కల్పించారని గుర్తు చేశారు. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
ఆదివాసీ యోధుడు కొమురంభీమ్ తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి, స్వామి రామానందతీర్ధ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మలతో పాటు ప్రజా ఉద్యమానికిన సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజా నేతల త్యాగాలను సర్వంగా స్మరించుకుంటున్నామన్నారు.
తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజా కవి కాళోజీ, మగ్దుం మొహినుద్దీన్, దాశరథి, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లాఖాన్ వంటి సాహితీ మూర్తులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రాంతం 60 ఏళ్లపాటు అస్తిత్వం కోసం ఉద్యమించి నేడు స్వరాష్ట్రంగా అన్నిరంగాలో ఎంతో ప్రగతిని సాధిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలో రాష్ట్రంలో హరిత, నీలి, జల సిరులు విప్లవాలతో పాటు విద్య, వైద్య రంగాలలో ప్రగతి సాధించి దేశంలో అన్ని రాష్ర్టాల కంటే ముందు వరుసలో నిలిచిందన్నారు.
ముందుగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, సీపీ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శసురభీ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు తదిరులు పాల్గొన్నారు.