మధిర, డిసెంబర్ 18 : పంచాయతీ ఎన్నికలు ముగియడం, ఈ నెల 22న కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టనుండడంతో పల్లెలకు కొత్త కళ వచ్చినట్లవుతోంది. దాదాపు 23 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పల్లెల్లో మళ్లీ ప్రజాప్రతినిధుల పాలన మొదలవుతోంది. సర్పంచ్ ఎన్నికలు పెట్టే సాహసం చేయలేక ప్రత్యేకాధికారులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వానికి న్యాయస్థానాలు తలంటుపోయడంతో ఎన్నికల నిర్వహణకు దిగక తప్పలేదు. దీనికి అదనంగా 42 శాతం రిజర్వేషన్ల హామీ వెంటాడింది. చివరికి ముక్కీమూలిగీ ఎన్నికల సమరానికి దిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పుంజుకోవడంతో అధికార పక్షంలో అంతులేని గడబిడ మొదలైంది. ఎట్టకేలకు పంచాయతీలకు ఎన్నికలు ముగిసినందున తదనంతర కార్యాచరణపై అధికారులు దృష్టిసారించారు. ఇన్నాళ్లూ స్పెషల్ ఆఫీసర్ల ఏలుబడిలో ఆలనాపాలనా కరువైన పంచాయతీ కార్యాలయాలకు ఇప్పుడు కొత్త సర్పంచ్ల రానున్నారు.
23 నెలలుగా అస్తవ్యస్తమైన గ్రామాలు..
గత 23 నెలలుగా ఎన్నికలు జరగకపోవడంతో ప్రజాప్రతినిధులు లేక గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. చివరకు వీధి లైట్లు వేయడానికి, కనీస అవసరాలు తీర్చడానికి కూడా నిధులు లేక అధికారులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు గ్రామ పంచాయతీ సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా నిలిచిపోయాయి. దీనివల్ల పల్లెల్లో మౌలిక వసతులు అధ్వానంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లెప్రగతి వంటి కార్యక్రమాలతో గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిధుల కేటాయింపు నిలిచిపోవడంతో స్థానిక అధికారులు అప్పులు తెచ్చి పనులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
కొలువు దీరనున్న కొత్త పాలక వర్గాలు
ఖమ్మం జిల్లాలోని 565 పంచాయతీల్లో ఈ నెల 22న కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఆ రోజున సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టనుండడంతో పల్లెల్లో పాలన మొదలుకానుంది. ఇందుకోసం పంచాయతీ కార్యాలయాలను అధికారులు ముస్తాబు చేస్తున్నారు.
నిధుల సవాల్..
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఎంతో ఆనందంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నప్పటికీ కొత్త నిధులు సహా పాత బిల్లుల వంటివి సవాల్‌గా మారనున్నాయి. గత సర్పంచ్‌లు చేసిన పనుల బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చే వారికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా? లేదా? అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.