రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు చూస్తే కోటలు దాటుతున్నయ్.. ఇచ్చిన హామీల అమలు చూస్తేనేమో నీటి మీద రాతల్లాగా మిగులుతున్నయ్. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు ఐనా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సరిగ్గా అమలుచేసింది లేదు.. పూటకోమాట మాట్లాడుతూ రైతులను గందరగోళంలో పడేస్తున్నాడు. రైతుభరోసా, రుణమాఫీ అమలు చేసినం.. రైతులకు అందిందో.. లేదో..? తెలియదు అంటూ మాట్లాడి సీఎం హోదాకే సిగ్గుచేటు తెచ్చిండు. పంట పెట్టుబడి సాయం కోసం తీసుకొచ్చిన ‘రైతుభరోసా’ పథకం అమలును రెండుసార్లు ఎగ్గొట్టిన రేవంత్ సర్కార్.. తాజాగా పథకం అమలుపై మరో కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. యాసంగి సీజన్ ప్రారంభం నాటినుంచి ఇదిగో ఇస్తున్నాం.. అదిగో ఇస్తున్నామంటూ రెండు, మూడుసార్లు తప్పుడు ప్రచారాలు చేసి రైతులను మోసం చేసింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తికాగానే ఇస్తామని నమ్మించి ఓసారి ఓట్లు రాబట్టుకున్నది. అటు పిమ్మట.. రైతుభరోసా కోసమంటూ ఆర్బీఐని రూ.9 వేల కోట్లు రుణం అడిగి తీసుకొని మంత్రుల కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించి మరోమారు అన్నదాతలకు మొండి‘చేయి’ చూపించింది. ఇప్పుడేమో.. మూడువిడతల్లో రైతుభరోసా పూర్తిచేస్తామంటూ ప్రచారం చేస్తున్నది. రేవంత్‌రెడ్డి మాటలపై నమ్మకం కోల్పోయిన అన్నదాతలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. – ఖమ్మం, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఈ ఏడాది యాసంగి సీజన్ రైతుభరోసా సాయంపై ఖమ్మంజిల్లా రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి సాయం అందుతుందో..? లేదో..? దేవుడికే తెలియాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ నెల 22వ తేదీ నుంచి రైతులకు రైతుభరోసా కింద పెట్టుబడి సాయాన్ని అకౌంట్లలో జమచేసేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. దీనిప్రకారం తొలివిడతలో మార్చి 22న ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండోవిడత మరో 20రోజుల తరువాత, మూడోవిడత ఏప్రిల్ నెలాఖరులో మొత్తం మూడు విడతల్లో రైతుభరోసా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాగు సమయంలో అందించాల్సి ఉండగా కోత దశలో పెట్టుబడి సాయం అందిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా ప్రచారమే తప్ప.. కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా రైతుభరోసా అందించిన దాఖలాలు లేవని విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుభరోసా డబ్బులు ఖాతాల్లోకి చేరేవరకు నమ్మకమే లేదంటూ చెబుతున్నారు. వచ్చినప్పుడు వచ్చిందిలే.. అనుకుంటున్న మాటలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రైతులపై మమకారం ఉంటూ సమయానికి ఠంఛనుగా రైతుభరోసా అందించే వారని మండిపడుతున్నారు. ఇంత ఆలస్యమైనా మొదటివిడత, రెండోవిడత, మూడోవిడతకు మధ్య 20రోజుల గ్యాప్ ఏంటంటూ.. ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పంట పెట్టుబడి సాయం కింద రైతుల కోసం తీసుకొచ్చిన రైతుబంధు పథకం ఠంఛన్‌గా ప్రతి సీజన్‌కు ముందుగానే అమలు చేసేవారని గుర్తుచేసుకుంటున్నారు.
ఎకరంలోపు రైతులు లక్షా 20 వేల మంది..
రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని అమలుచేస్తే తొలివిడతగా ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు ఒక లక్షా ఇరవై వేల పైచిలుకు రైతులకు లబ్ధి చేకూరనున్నది. దీనిప్రకారం ఎకరం ఉన్న రైతుకు యాసంగి సీజన్‌కు గానూ రూ.6 వేలు బ్యాంకు ఖాతాలో జమకానున్నాయి. ఆ తరువాత మరో 20రోజులకు రెండోవిడత, ఏప్రిల్ చివరాఖరుకు మూడోవిడత కింద నగదు జమ చేస్తామని ప్రకటించింది. రైతుభరోసా పథకం కింద ఖమ్మం జిల్లాలో సుమారుగా మొత్తం 3.50 లక్షలు మంది రైతులు ఉండగా సుమారు రూ.390 కోట్లు జమ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ అధికారుల లెక్కలు చెప్తున్నాయి.
మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ సీజన్‌కైనా పెట్టుబడి సాయం అందుతుందో లేదో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలు ఉంటే ఓ రకంగా.. లేకుంటే మరోవిధంగా రైతులకు పెట్టుబడి సాయంపై మాట్లాడుతున్నాడని, రేవంత్‌రెడ్డి తీరు చూస్తుంటే ఓడ ఎక్కాక ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదు సీజన్ పంట కాలాలు పూర్తయ్యాయని, ఇందులో కేవలం రెండు సీజన్లకే రైతుభరోసా అమలుచేశారని, మూడు విడతలు ఎగ్గొట్టినట్లు వాపోతున్నారు. మరి హస్తం పార్టీ ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ నెల 22వ తేదీ రైతుభరోసా సాయం రైతుల ఖాతాల్లోకి చేరేనా..? అనేది వేచిచూడాల్సి ఉంది.