సిటీబ్యూరో: మ్యాట్రీమోనీ మాటున ఓ యువకుడిని నట్టేట ముంచారు సైబర్ కేటుగాళ్లు. హయత్‌నగర్ ప్రాంతంలో నివాసముండే ఓ ప్రైవేట్ ఉద్యోగి పెండ్లి కోసం సంగం యాప్ (షాదీ.కామ్ అనుబంధ యాప్)లో ప్రీతి గుప్తా అనే పేరుతో ఉన్న ప్రొఫైల్‌ను చూశాడు. అందులోని నంబర్‌కు కనెక్ట్ అయ్యాడు. ఆమె కూడా పెండ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. నమ్మకం కుదిరిన తరువాత ప్రీతి గుప్తా తన ప్లాన్‌ను అమలు చేయడం మొదలు పెట్టింది. తాను ఎసెల్లార్స్షాప్స్ అనే యాప్ ద్వారా ఆన్లైన్ డ్రాప్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నానని, అందులో పెట్టుబడి పెడితే ఊహించని రీతిలో లాభాలు వస్తాయని అతడికి ఆశ చూపించింది.
ఎసెల్లార్స్స్టోర్బై.సీసీ, ఎసెల్లార్స్స్టోర్.ఎక్స్‌వైజెడ్, ఎసెల్లార్స్షాప్స్.వీఐపీ అనే వెబ్సైట్లలో ఖాతా తెరిపించింది. బాధితుడు దఫదఫాలుగా రూ. 45,62,833 లక్షలను వివిధ ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తూ వెళ్లాడు. స్క్రీన్‌పై లాభాలు కనిపించినా.. విత్‌డ్రాకు వీలులేకుండాపోయింది. బాధితుడు ప్రీతి గుప్తాకు ఫోన్ చేశాడు. కమీషన్లు, ఫైనాన్సింగ్ చార్జీలు 30 శాతం వరకు ట్యాక్స్‌లు కట్టక తప్పదని, ఆ డబ్బులు కడితే ఉన్న లాభాలన్నీ విత్‌డ్రా చేసుకోవచ్చంటూ.. హానీ ట్రాప్ చేసిన సైబర్ నేరగాళ్లు చెప్పారు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.