వర్షాస్వేకత్ర తిష్ఠేత స్థానే పుణ్య జలావృతే
యతులు చాతుర్మాస్య కాలంలో మాత్రం పవిత్ర
జలములు గల ఒకే చోట నివసించాలి.
నారదుడు పూర్వజన్మలో ఒక దాసీ పుత్రుడు. ఆయన తల్లి ఐశ్వర్యవంతుడైన వేదవేత్తయైన ఒక బ్రాహ్మణుని ఇంటిలో ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం, ఆవులకు పాలు పితకడం లాంటి పనులు చేసేది. పిల్లవాడైన నారదుడూ వెంట వెళ్లేవాడు. ఆ ఇంటికి వర్షాకాలంలో కొంతమంది సన్యాసులు చాతుర్మాస్య దీక్షకోసం వచ్చారు. అంటే ఆ నాలుగు నెలలూ అక్కడే ఉంటారు. ‘రోజూ నీవు ఉదయాన్నే స్నానం చేసి, వాళ్లకి పీటలు వెయ్యడం, దర్భాసనాలు వెయ్యడం, వాళ్ల మడిదుస్తులు తీసుకురావడం, ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి’ అని యజమాని పిల్లవాణ్ని ఆదేశించాడు.
నారదుడు అలాగే శ్రద్ధతో సేవిస్తూ ఉండేవాడు. వాళ్లు మహా భాగవతులు. అందరిలోనూ పరబ్రహ్మాన్ని దర్శించే వాళ్లు కాబట్టి నారదుణ్ని సేవకుడిగా చూడలేదు. అయిదేండ్ల పిల్లవాడైనా తమకు చేస్తున్న సేవను మెచ్చుకుంటూ వారు తినగా మిగిలిన పదార్థాలను ఇచ్చేవారు. అతను ఆ భాగవత శేషాన్ని తినేవాడు. సన్యాసులు పొద్దున్నే మేలుకొనడం, భగవదర్చన చేసుకోవడం, వేదం చదువుకోవడం, వాటిని గూర్చి చర్చించుకోవడం చేసేవారు. మధ్యాహ్నం భగవంతుని స్మరిస్తూ సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేసేవారు. పసివాడైన నారదుడు ఎంతో ఆసక్తితో అవన్నీ చూస్తూ వారిలో కలిసిపోయేవాడు. వాళ్లంతా పిల్లవాడు మనవాడు అనుకునేట్టు మెలిగాడు. క్రమంగా చాతుర్మాస్యం ముగిసింది. వాళ్లు వెళ్లిపోతూ నారదుడి పరిచర్యకు సంప్రీతులై చేరదీసి కృష్ణ పరమాత్మ ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించారు. మాయ ఎలాంటిదో, సత్యం ఎలాంటిదో విడమరచి చెప్పారు.
సత్పురుష సాంగత్యంతో నారదుడి హృదయం పరిశుద్ధమై మంత్రజపం మీద నిష్ఠ కుదిరింది. తదేక ధ్యానంతో శ్రీహరిని ప్రసన్నం చేసుకోగలిగినాడు. తర్వాత జన్మలో బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. నారదుడు యథేచ్ఛగా లోకాలన్నీ తిరుగుతూ భగవత్ సంకీర్తన కావిస్తూ ఉంటాడు. ఈ విధంగా చాతుర్మాస్య దీక్షాపరులను సేవించి నారదుడు భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలిగినాడు.