సూర్యాపేట, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి అమరావతికి ఏర్పాటు చేయనున్న బుల్లెట్ రైల్ తొలుత ప్రకటించిన అలైన్మెంట్ ప్రకారమే చేపట్టాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. జాతీయ రహదారి 65కు సమాంతరంగా రైల్వే కారిడార్ సాధించేందుకు ఆదివారం సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్ నుంచి అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
జగదీశ్‌రెడ్డి.. కేసీఆర్ వెంట నర్సంపేటకు వెళ్లినందున రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేకపోయారు. అయినప్పటికీ ఆయన సమావేశంలో పాల్గొన్న వక్తలకు ఫోన్ చేసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బుల్లెట్ రైల్ కోసం అందరం కలిసికట్టుగా కొట్లాడాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. పార్టీలకతీతంగా ఉద్యమం రూపొందించడం మంచి పరిణామమని పేర్కొన్నారు.