ఖమ్మం, డిసెంబర్ 3: ‘పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించడం ఏమిటి? ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుంది’ అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం జిల్లాల్లో పర్యటిస్తూ.. తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఎన్నికల వేళ బహిరంగ సభల్లో కోరడం ఒక దుష్ట సంప్రదాయానికి తెర లేపడమే అవుతుందని మండిపడ్డారు.
మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ శంకుస్థాపనను ఎన్నికల ప్రచార కార్యక్రమంగా మార్చడం ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం వచ్చినా సభకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ప్రాంగణం వెలవెలబోయిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థులను సభకు తరలించడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. సీఎం పర్యటనల కోసం చేస్తున్న ఖర్చు.. రెండేళ్ల కాలంలో జిల్లాకు కేటాయించిన అభివృద్ధి నిధులకన్నా ఎక్కువగా ఉన్నదని విమర్శించారు. నేలకొండపల్లిలో యువ రైతు వీరన్న ఆత్మహత్య.. ప్రభుత్వ విధానాల వైఫల్యం వల్ల జరిగిన హత్యగా భావించాల్సి ఉంటుందన్నారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైనందున రైతులకు మంత్రులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
420 హామీలను గాలికొదిలేశారని, తామేదో ఘనకార్యం సాధించినట్లు విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి, భద్రాచలంలో నామినేషన్ల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల తీరుపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా సమాధి చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యమకారులు కర్నాటి కృష్ణ, మక్బూల్, కూరాకుల నాగభూషణం, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, పగడాల నరేందర్, తాజుద్దీన్, మహ్మద్ రఫీ, మంచికంటి నరేశ్, బలుసు మురళీకృష్ణ, చీకటి రాంబాబు, కోడిరెక ఉమాశంకర్, నెమలికొండ వంశీ, వీరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
శ్రీకాంతాచారికి ఘన నివాళి
తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని, ఆయన ఆశయాలను సాధించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఖమ్మంలోని తెలంగాణ భవన్లో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.