అశ్వారావుపేట టౌన్/ చండ్రుగొండ/ బూర్గంపహాడ్/ వైరా టౌన్, డిసెంబర్ 1: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. పంటలు చేతికొచ్చే సమయంలో వానలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కలాల్లో ఉన్న వరి ధాన్యాన్ని తడవకుండా పట్టాలతో కప్పారు. మరో రెండ్రోజులపాటు వానలు ఉన్నాయనే వాతావరణశాఖ హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నది.
కాగా, ఆదివారం కురిసిన వర్షం కారణంగా బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం కొంతమేరకు తడిచింది. కొందరు రైతులు వారి వద్ద ఉన్న పరదాలను కప్పగా మరికొంతమంది రైతులు వాటిని కప్పే సమయానికి ధాన్యం రాశులు తడిచిపోయాయి. మార్కెట్‌యార్డులో వసతి సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఇలా జరిగిందని రైతులు మండిపడుతున్నారు. వైరా వ్యవసాయ మార్కెట్లోనూ ధాన్యం తడిచిపోయింది. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లో కనీస ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. వైరా మార్కెట్లో ధాన్యం రైతుల ఇబ్బందులను తెలంగాణ రైతు సంఘం బృంద సభ్యులు పరిశీలించారు.